
గౌహతి: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2022లో భారత అండర్ 19 కెప్టెన్ యశ్ ధుల్ దుమ్మురేపుతున్నాడు. సూపర్ బ్యాటింగ్‌తో యంగ్ ఇండియాను విశ్వవిజేతగా నిలబెట్టిన యశ్ ధుల్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఢిల్లీ టీమ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ క్రికెటర్.. తమిళనాడుతో జరిగిన తన ఫస్ట్ మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదాడు. తద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఎన్నో ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. యశ్ ధుల్‌కు ముందు గుజరాత్ దిగ్గజ బ్యాట్స్‌మన్ నారీ కాంట్రాక్టర్ ఈ ఫీట్‌ను తొలిసారి సాధించగా.. మహారాష్ట్ర ప్లేయర్ విరాగ్ అవతే రెండో ఆటగాడిగా ఉన్నాడు. 1952-53 రంజీట్రోఫీ సీజన్‌లో నారీ కాంట్రాక్టర్ ఈ ఘనత సాధించగా.. 2012-13 సీజన్‌లో విరాగ్ అవతే ఈ ఫీట్ నమోదు చేశాడు. దాంతో 8 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించిన ఒకే ఒక్కడిగా యశ్ ధుల్ గుర్తింపు పొందాడు. తొలి ఇన్నింగ్స్‌లో 150 బంతుల్లో 18 ఫోర్లతో 113 పరుగులు చేసిన యశ్.. రెండో ఇన్నింగ్స్‌లో 202 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌తో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అతనికి తోడుగా మరో ఓపెనర్ ధ్రువ్ షోరే(165 బంతుల్లో 13 ఫోర్లతో 107 నాటౌట్) కూడా సెంచరీ బాదడంతో చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 228 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. కాగా ఐపీఎల్2022 సీజన్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు యశ్ ధుల్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ జట్టు తెగ సంబరపడిపోతుంది.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 452 పరుగులకు ఆలౌటైంది. యశ్‌ధుల్ సెంచరీతో పాటు లలిత్ యాదవ్(177) భారీ శతకంతో రాణించాడు. ఇక తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 494 పరుగులకు ఆలౌటవ్వడంతో 42 పరుగుల స్వల్ప ఆధిక్యం ఆ జట్టుకు లభించింది. షారుఖ్ ఖాన్(194) విధ్వంసకర సెంచరీతో పాటు బాబా ఇంద్రజీత్(117) సెంచరీతో మెరిసాడు.