టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ మసకబారుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ఎక్స్ మోస్ట్ టాక్‌డ్ ఇండియన్ పర్సనాలటీస్ ఆగస్ట్ జాబితాలో ఈ ఇద్దరూ టాప్-5 ప్లేస్‌ను కోల్పోయారు. టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. దాంతో ఐపీఎల్ 2025 విజయానంతరం కోహ్లీ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు.
తన నివాసాన్ని కూడా ఇంగ్లండ్‌కు మార్చుకోవడంతో విరాట్ కోహ్లీ గురించి పెద్దగా చర్చ జరగలేదు. దాంతో ఆగస్ట్ నెలలో ఎక్స్ వేదికగా ఎక్కవగా చర్చనీయాంశమైన భారత ప్రముఖుల జాబితాలో కోహ్లీ ఏడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు కోహ్లీ ఎప్పుడూ టాప్-5లో ఉండేవాడు.

మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ కూడా 9వ స్థానానికి పడిపోయాడు. అతను పూర్తిగా ఇంటికే పరిమితం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఐదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత అతను కూడా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. సోషల్ మీడియాకు కూడా ధోనీ దూరంగా ఉంటాడు. దాంతో అతని గురించి గత నెలలో ఎక్స్ వేదికగా పెద్దగా చర్చ జరగలేదు.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. కోహ్లీ అనంతరం భారత ముఖ చిత్రంగా ఎదుగుతున్న శుభ్‌మన్ గిల్ వేగంగా తన క్రేజ్‌ను పెంచుకుంటున్నాడు. టాప్-10లో ముగ్గురు క్రికెటర్లే ఉండటం గమనార్హం.
ఈ జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆగస్ట్ నెలలో ఎక్స్ వేదికగా నరేంద్ర మోదీ గురించి ఎక్కువగా చర్చించుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రెండో స్థానంలో నిలవగా.. తమిళ నటుడు, దళపతి విజయ్ మూడో స్థానాన్ని అందుకున్నాడు. ఆయన ఇటీవలే రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. వార్-2 సినిమా నేపథ్యంలో ఎన్టీఆర్ పేరు తీవ్ర చర్చనీయాంశమైంది.
నాలుగో స్థానంలో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచాడు. హరిహర వీరమల్లు సినిమాతో పాటు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పేరు ఎక్స్‌లో ఎక్కువగా ట్రెండ్ అయ్యింది. విచిత్రకరమైన విషయం ఏంటంటే ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ 6వ స్థానంలో నిలిచాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు 8వ స్థానంలో నిలవగా.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 10వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టాప్-10లో ఒక్క మహిళా కూడా లేకపోవడం విశేషం.