
ముంబై: టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఓటమికి అతన్ని నిందించడం సరికాదన్నాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాదని, న్యూజిలాండ్ క్రికెటర్లు సైతం నెమ్మదిగానే ఆడారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మెగా ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి సీనియర్ ఆటగాళ్ల వైఫల్యమే కారణమని, జట్టును సమూలంగా మార్చాలని అవసరం ఉందని కోహ్లీ అన్నాడు. పుజారా పేరు ప్రస్తావించకపోయినా.. నయావాల్‌ను తన పరోక్ష వ్యాఖ్యలతో విమర్శించాడు.
ఈ నేపథ్యంలోనే గవాస్కర్ తాజాగా ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీని ఉద్దేశించే పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. 'పుజారాను వేలెత్తి చూపుతూ భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడం కష్టం. అతను డిఫెన్స్‌తో అడ్డుగోడగా నిలబడతాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లకు ప్రాముఖ్యం తీసుకొస్తాడు. ఒక ఎండ్‌లో పాతుకుపోయి మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా ఆడేందుకు వీలు కల్పిస్తాడు. టీమిండియా సంగతి పక్కన పెట్టండి. న్యూజిలాండ్ బ్యాటింగూ కూడా మెల్లగానే సాగింది. ఎందుకంటే పరిస్థితులు బ్యాట్స్‌మెన్ కన్నా ఎక్కువగా బౌలర్లకే అనుకూలంగా ఉన్నాయి. డేవిడ్ కాన్వే, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ సైతం ఆచితూచే ఇన్నింగ్స్‌లు ఆరంభించారు.' అని గవాస్కర్ గుర్తు చేశారు.
ఇక బ్యాటింగ్ ద్వారా న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపింది మాత్రం ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అని, నిజానికి అతను 70 బంతుల్లో 7 పరుగులే చేశాడనే విషయాన్ని గ్రహించాలన్నాడు. అతని డిఫెన్స్ ద్వారా మిగతా బ్యాట్స్‌మెన్ లాభపడ్డారని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. పుజారాను విమర్శించడం మానేసి ఈ విషయాన్నిటిని పరిగణలోకి తీసుకోవాలని చురకలంటించాడు.
'పుజరాను విమర్శించేవారంతా దానిని గుర్తుంచుకోవాలి. న్యూజిలాండ్ సైతం మెల్లగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. కానీ, మీరు పుజారాను వేలెత్తి చూపితే మాత్రం చేసేదేం లేదు. అవతలి ఎండ్‌లో ఆటగాడు స్వేచ్ఛగా పరుగులు చేసేందుకు సాయపడే క్రికెటర్ పుజారా. డిఫెన్స్ అతడి శైలి అని అందరికీ తెలుసు' అని గవాస్కర్ స్పష్టం చేశాడు.