
న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో నలుగురు పేసర్లను ఆడించాలనుకుంటే మహ్మద్ సిరాజ్ బదులు శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవాలని టీమిండియా మాజీ సెలెక్టర్ శరణ్ దీప్ సింగ్ సూచించాడు. సౌతాంప్టన్ పిచ్ పరిస్థితులకు అతని బౌలింగ్ సూటవుతుందన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో సిరాజ్ అద్భుతంగా ఆడాడని కానీ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ బలంగా ఉండాలంటే శార్దూల్‌ను తీసుకోవాలన్నాడు. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మెగా పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మెగా ఫైనల్ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడిన శరణ్ దీప్ సింగ్ టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పలు సూచనలు చేశాడు.
'సౌతాంప్టన్‌లో వాతావరణం చల్లగా ఉండి మబ్బులుంటే నాలుగో పేసర్‌ను ఆడించాలి. ఇషాంత్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీని ఎలాగూ తీసుకుంటారు. అదనపు పేసర్‌గా నేనైతే సిరాజ్ బదులు శార్దూల్‌ను ఎంచుకుంటా. ఎందుకంటే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ వనరులు అవసరం. శార్దూల్ అందుకు న్యాయం చేస్తాడు. పరిస్థితులకు తగ్గట్టు అతను బంతిని బాగా స్వింగ్ చేయగలడు. పైగా దేశవాళీ క్రికెట్లో ఎక్కువ అనుభవం ఉంది. చురుకుగా ఆలోచిస్తాడు.
ఒకవేళ టీమింయా నాలుగో పేసర్‌ను ఎంచుకుంటే మాత్రం జడేజాను పక్కన పెట్టాలి. న్యూజిలాండ్‌లో ఎడమచేతివాటం ఆటగాళ్లు ఉండటంతో అశ్విన్ కచ్చితంగా ఆడాల్సిందే. టీమిండియా బ్యాటింగ్ విభాగం ఎలాగూ బాగుంది. శుభ్‌మన్ గిల్ ఆస్ట్రేలియా ఫామ్‌ను ఇక్కడా కొనసాగించడం కీలకం. అతనో క్లాస్ ఆటగాడు. ఫైనల్‌లో రోహిత్‌తో కలిసి శుభారంభం అందిస్తాడనే అనుకుంటున్నా. సొంతగడ్డపై ఇంగ్లండ్ సిరీస్‌లో అతను రాణించలేదు. ఇప్పుడు పుంజుకోవాలని కోరుకుంటున్నా.' అని శరణ్ దీప్ సింగ్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ స్థానానికి విపరీతమైన పోటీ నెలకొందని శరణ్‌దీప్ తెలిపాడు. ఇప్పటికే మయాంక్ అగర్వాల్ రిజర్వు బెంచీపై ఉన్నాడని, అతను తక్కువ వ్యవధిలోనే టెస్టుల్లో సత్తాచాటాడని గుర్తు చేశాడు. శ్రీలంకకు ఎంపిక చేసిన భారత జట్టులో హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా దూబె లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఒకవేళ అతను బౌలింగ్ చేయకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. శివమ్ దూబె లేదా విజయ్ శంకర్‌ను తీసుకోవాల్సిందన్నాడు.