
సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ వరుసగా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కివీస్ స్టార్ పేసర్ కైల్ జెమీసన్ వరుస ఓవర్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(13), చతేశ్వర్ పుజారా(15) ఔటయ్యారు. అనవసరపు షాట్లతో ఈ ఇద్దరు పెవిలియన్ బాట పట్టారు. ముందు కోహ్లీ బయటకు వెళ్తున్న బంతిని వెంటాడి కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. పుజారా సైతం అదే తరహా బంతిని ఆడి స్లీప్‌లో రాస్ టేలర్‌కు చిక్కాడు. దాంతో భారత్ 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో రిషభ్ పంత్(5), రహానే(4) ఉన్నారు.
అంతకుముందు 64/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రిజర్వ్ డే సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో బౌలింగ్ చేసిన జెమీసన్ మరోసారి భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. అప్పటి వరకు ఇన్‌సైడ్ స్వింగర్స్ వేసి ఒత్తిడి పెంచిన అతను ఆ తర్వాత ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసి ఫలితం రాబట్టాడు. అతను వేసిన 37 ఓవర్ ఐదో బంతికి కోహ్లీ ఔటవ్వగా.. 38వ ఓవర్ మూడో బంతికి పుజారా అదే తరహా ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను ఆడి వెనుదిరిగాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు కోహ్లీ 5 పరుగులే జత చేయగా.. పుజారా ఒక పరుగు మాత్రమే చేసి పేలవ షాట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఫస్ట్ సెషన్ ఫస్ట్ అవర్‌లోనే టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడి నెలకొంది.
క్రీజులోకి వచ్చిన పంత్ వచ్చి రావడంతోనే తనదైన బౌండరీతో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కానీ అదే జోరులో జెమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో సౌథీ జారవిడచడంతో పంత్‌తో పాటు భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. భారత్ ఆశలన్నీ పంత్, రహానేపైనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 53 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. 200 + లీడ్ సాధిస్తే భారత్ ఓటమి తప్పించుకుంటుంది.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 217 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 249 ఆలౌట్