WTC Final అలా నిర్వహించాల్సింది: రవి శాస్త్రి

ముంబై: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను బెస్ట్ ఆఫ్-3 ఫార్మాట్‌లో నిర్వహించాల్సిందని టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికి ఇలా జరిగినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం ఫైనల్లో మూడు మ్యాచ్‌ల విధానం పెట్టాలని సూచించాడు. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ ఫైట్ కోసం ఇంగ్లండ్ బయల్దేరే ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి మీడియాతో మాట్లాడిన రవి శాస్త్రి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మెగా ఫైనల్ చేరేందుకు కుర్రాళ్లు చాలా కష్టపడ్డారని, ఇది రాత్రికి రాత్రే దక్కిన విజయం కాదన్నాడు.

బెస్ట్ ఆఫ్-3 అయితే బాగుండేది..
'డబ్ల్యూటీసీ ఫైనల్‌ను బెస్టాఫ్-3 ఫార్మాట్‌లో నిర్వహించాల్సింది. సుదీర్ఘ కాలంగా జరిగిన టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్‌తో విజేతను తేల్చడం కంటే బెస్ట్ ఆఫ్-3 ఫార్మాట్ ద్వారా అయితే బాగుండేది. ఇప్పటికైతే ఒక్క మ్యాచ్‌తో కానివ్వండి. భవిష్యత్తులోనైనా బెస్ట్ ఆఫ్-3 ఫార్మాట్‌లో నిర్వహించాలి. ఈ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు భారత ఆటగాళ్లు చాలా రోజులు శ్రమించారు. ఇదంతా ఒక్క రాత్రిలో సాధించింది కాదు. చాలా రోజులుగా భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించిన ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ విజయమే గొప్ప అనుభూతినిస్తుంది.'అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

ఇదే ఏకైక మార్గం..
శ్రీలంక పర్యటనకు ఇండియా బి టీమ్‌ను పంపించడంపై స్పందిస్తూ.. ఒకేసారి రెండు జట్లను ఆడించడం ద్వారా ఆటను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. 'టీ20 క్రికెట్‌ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలంటే ఇదే సరైన మార్గం. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కాలంటే మరిన్నీ దేశాలు, జట్లు క్రికెట్ ఆడాలి. కాబట్టి ఒకే టైమ్‌లో రెండు జట్లను ఆడించడం ద్వారా ఆటను ముందుకు తీసుకెళ్లవచ్చు.'అని శాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇక 2014, 2021 కోహ్లీకి ఉన్నా తేడా ఏంటనే ప్రశ్నకు శాస్త్రి తనదైన శైలిలో బదులిచ్చాడు. 2014లో కోహ్లీ బొద్దుగా ఉంటే.. ఇప్పుడే ఫిట్‌గా ఉన్నాడని, అంతేకాకుండా మరో 5 వేల 500 పరుగులు చేశాడని చమత్కరించాడు. దాంతో ప్రెస్‌మీట్‌లో నవ్వులు పూసాయి.

నాపై ఎలాంటి ఒత్తిడి లేదు..
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇప్పుడే కాదు ఎప్పుడూ తాను ఒత్తిడికి లోనవ్వనని, జట్టును ముందుకు నడిపించడంపైనే దృష్టిసారిస్తానని తెలిపాడు. ఇంగ్లండ్‌లోని పరిస్థితులు న్యూజిలాండ్‌కు అడ్వాంటేజ్ ఏం కాదని, ఇరు జట్లకు సమానమేనని కోహ్లీ స్పష్టం చేశాడు. అది ఆలోచన తీరుపైనే ఆధారపడి ఉంటుందని, ఆస్ట్రేలియాలో ఆ జట్టుకే పరిస్థితులు అనుకూలిస్తాయనుకుంటే విజయం దక్కేదా? అని ప్రశ్నించాడు. తాము ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయని భావిస్తున్నామని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications