
సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు వరణుడు అంతరాయం కలిగిస్తూనే ఉన్నాడు. వర్షం కారణంగా తొలి రోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు రెండు సెషన్లు మాత్రమే సాధ్యమైంది. ఇక మూడో రోజు కొంత బ్రేక్ తీసుకున్న వాన దేవుడు.. పూర్తి ఆటకు సహకరించాడు. బ్యాడ్ లైట్ కారణంగా అరగంట ముందే మ్యాచ్ ఆగిపోయినా.. మూడు సెషన్ల ఆట సాధ్యమైంది. ఇక కీలకమైన నాలుగో రోజు మళ్లీ జోరందుకున్న వరణుడు పూర్తి ఆటను మింగేసాడు.
ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మైదానం నీటితో మునిగిపోయింది. పిచ్‌పై కవర్లు కప్పిఉంచినప్పటికీ.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మధ్యలో కొంత వర్షం ఆగినప్పటికీ.. మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అంపైర్లు నాలుగో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా ఫస్ట్ సెషన్ రద్దు చేసి లంచ్ బ్రేక్ ప్రకటించిన అంపైర్లు.. గంట వ్యవధిలోనే తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'వర్షం కారణంగా నాలుగో రోజు ఆట రద్దయింది. టీమిండియాకు అండగా నిలిచేందుకు మైదానానికి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. మళ్లీ రేపు కలుద్దాం'అని అభిమానుల ఫొటోను షేర్ చేసింది.
ఈ మ్యాచ్‌కు ఐసీసీ రిజ్వరేడేను కేటాయించడంతో మొత్తం ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ రెండు రోజులు వర్షం అంతరాయం కలిగించకుంటే మ్యాచ్ ఫలితం తేలనుంది. అలా కాకుండా ఒక్క సెషన్ రద్దయినా మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఇరు జట్లు షేర్ చేసుకోనున్నాయి. ఇక రిజర్వ్ డే ఆడించడంపై కూడా ఐదో రోజు ఆట చివరి గంటలో నిర్ణయం తీసుకోనున్నారు. ఫలితం తేలే అవకాశం ఉంటేనే రిజర్వ్ డేను ఉపయోగించుకోనున్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. కైల్ జెమీసన్ ఐదు వికెట్లతో చెలరేగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 92.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. రహానే (190 బంతుల్లో 5 ఫోర్లతో 49), కోహ్లీ (196 బంతుల్లో 1ఫోర్‌తో 44) రాణించారు. బౌల్ట్, వాగ్నర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అశ్విన్, ఇషాంత్‌కు చెరో వికెట్ దక్కింది.