WTC Final 2021: కోహ్లీసేనను కలవరపెడుతున్న చెత్త రికార్డు.. గత 18 ఏళ్లుగా సతాయిస్తున్న కివీస్!

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ముందు ఓ చెత్త రికార్డు టీమిండియాను కలవర పెడుతుంది. మరో 5 రోజుల్లో ప్రారంభంకానున్న ఈ మెగాపోరులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు.. కేన్ విలియమ్సన్ సారథ్యంలో న్యూజిలాండ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే 2003 వన్డే ప్రపంచకప్ తర్వాత ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లో కూడా భారత జట్టు విజయం సాధించలేదు. ఈ 18 ఏళ్ల కాలంలో ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో ఆరుసార్లు తలపడిన భారత జట్టు.. ఐదింటిలో ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ వర్షంతో జరగలేదు.

2007 టీ20 ప్రపంచకప్ గెలిచినా..
2003 వన్డే ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడిన సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు 7 వికెట్లతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత 2007 వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో కివీస్‌తో ఆడే అవకాశం రాలేదు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కూడా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు గెలిచిన ధోనీ సేన ఒక్క కివీస్ చేతిలోనే 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

2016లో చిత్తుగా..
ఆ తర్వాత 2009 చాంపియన్స్ ట్రోఫీలో కివీస్‌తో ఆడే అవకాశం రాలేదు. ఇక భారత్ గెలిచిన 2011 ప్రపంచకప్‌లోనూ కివీస్‌తో తలపడలేదు. అనంతరం జరిగిన 2012 టీ20 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్‌లోనూ ధోనీ సేన.. న్యూజిలాండ్‌తో తలపడలేదు. వేర్వేరు గ్రూప్‌ల్లో ఉండటంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు సాధ్యం కాలేదు. 2016 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే ధోనీసేన 47 పరుగులతో చిత్తయింది. స్పిన్ ట్రాక్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేసింది. దాంతో భారత్ విజయం సులువని అంతా భావించారు. కానీ న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్(4/11), ఇష్ సోది(3/18) చెలరేగడంతో భారత్ 79 పరుగులకే కుప్పకూలింది.

ధోనీ పోరాడినా..
2017 చాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు తలపడలేదు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. తొలి మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. కీలకమైన సెమీస్‌లో భారత్ 18 పరుగులతో ఓటమిపాలైంది. టాపార్డర్ విఫలమైన వేళ మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. ఇక ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ ఆడిన 6 సిరీస్‌ల్లో 5 గెలవగా.. న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో మాత్రం క్లీన్ స్వీప్ అయింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడటం గమనార్హం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లను వారి సొంతగడ్డలపై ఓడించిన భారత్.. న్యూజిలాండ్ చేతిలో మాత్రం ఓటమిపాలైంది.

ఆ ఒక్క ఫైనల్లో కూడా..
క్రికెట్ చరిత్రలో ఒకే ఒకసారి ఈ ఇరు జట్లు ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో తలపడగా.. ఆ ఒక్కసారి కూడా న్యూజిలాండే విజయం సాధించింది. ఐసీసీ నిర్వహించిన 2000 నాకౌట్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై గెలిచిన కివీస్ టైటిల్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు కివీస్ ఖాతాలో ఉన్న ఏకైక ఐసీసీ టైటిల్ కూడా ఇదే. టెస్ట్ క్రికెట్ విషయానికొస్తే న్యూజిలాండ్ గడ్డపై భారత్‌కు, భారత గడ్డపై న్యూజిలాండ్‌కు మెరుగైన రికార్డు లేదు. ఓవరాల్‌గా. ఇప్పటివరకు ఇరు జట్లు 59 మ్యాచ్‌లు ఆడగా.. టీమిండియా 21 విజయాలు సాధించింది. న్యూజిలాండ్ 12 మ్యాచ్‌ల్లో గెలవగా 26 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కనీసం ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లోనైనా గెలిచి లెక్క సరిచేస్తుందో? లేక కివీస్‌కే టైటిల్ చేజార్చుకుంటుందో చూడాలి!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications