న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన వివరాలను ఆలిండియా సెలెక్షన్ కమిటీ మంగళవారం వెల్లడించింది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన జట్టునే దాదాపు కొనసాగించిన బీసీసీఐ.. గాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేకు అవకాశం కల్పించింది.
పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఇషాన్ కిషన్‌పై కూడా వేటు వేసింది. కేఎల్ రాహుల్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా పరిగణించింది. అజింక్యా రహానే రీఎంట్రీపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2023 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న రహానేను ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతుండగా.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.

కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టెస్ట్ టీమ్‌లోకి రహానేను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లే జరిగాయని, మిగతా మ్యాచ్‌ల్లో రహానే విఫలమైతే పరిస్థితి ఏందని నిలదీస్తున్నారు. మరోవైపు ఒక్క టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడిన సూర్యకుమార్ యాదవ్‌ను ఎందుకు పక్కనపెట్టారని, వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌కు ఎందుకు అండగా నిలుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే జట్లను ఎంపిక చేసినప్పుడు రంజీ ట్రోఫీని నిర్వహించడం ఎందుకని, ఆ టోర్నీని నిర్వహించడం ఆపేసి ఏడాదంతా ఐపీఎలే ఆడించాలని సెటైర్లు పేల్చుతున్నారు. కొందరైతే బీసీసీఐ సెక్రటరీ జై షా పేరును ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. 'జై షా గారూ.. ఇక ఆ రంజీ ట్రోఫీ ఎందుకు సార్'అని ప్రశ్నిస్తున్నారు.
బీసీసీఐ సెలెక్షన్ ఎజెండా తెలియక సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా రంజీ ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు బాదరని, ముందే చెబుతే ఐపీఎల్‌కే సిద్దమయ్యేవారని సెటైర్లు పేల్చుతున్నారు. గత 15 నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్న రహానే.. అసలు మ్యాచ్‌లో విఫలమైతే పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఐపీఎల్ కంటే ముందే రహానే.. రంజీ ట్రోఫీలో కూడా రాణించాడనే విషయం మరిచిపోవద్దని అతని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ముంబై జట్టు కెప్టెన్‌గా రహానే.. 11 ఇన్నింగ్స్‌ల్లో 57.63 యావరేజ్‌తో 634 పరుగులు చేశాడు. అదే జోరును ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో 209 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 199.04గా ఉండటం ఈ గమనార్హం. ఈ ప్రదర్శనే రహానేకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే టీమ్‌లో చోటు దక్కేలా చేసింది.