
సౌతాంప్టన్: భారత్‌తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాంగ్ కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ప్లాన్.. మహమ్మద్ షమీ సూపర్ బౌలింగ్.. శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో టీమిండియా ఎట్టకేలకు రాస్ టేలర్(11) వికెట్ సాధించింది. 101/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్‌పై భారత్ బౌలర్లు ఎదురు దాడికి దిగారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందుకుంటు ఇబ్బంది పెట్టారు. బుమ్రా, షమీ, ఇషాంత్ ఇలా ముగ్గురు ప్రత్యర్థికి పరుగులివ్వకుండా కట్టడి చేశారు.
అయితే మరోవైపు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ సైతం ధీటుగా ఎదుర్కొన్నారు. పక్కా వ్యూహంతో పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యారు. దాదాపు 13 ఓవర్ల పాటు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ విసుగుతెప్పించారు. 13 ఓవర్లలో న్యూజిలాండ్ చేసింది కేవలం 16 పరుగులు మాత్రమే అంటే వారి బ్యాటింగ్ ఎంత జిడ్డుగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 117/2 డ్రింక్ బ్రేక్ తీసుకోగా.. ఈ విరామం భారత్‌కు కలిసొచ్చింది.
ఈ బ్రేక్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మహమ్మద్ షమీకి బంతినందిస్తూ కొన్ని సూచనలు చేశాడు. అటాకింగ్ ఫీల్డింగ్‌తో పాటు షాట్ ఆడేలా బంతి వేయాలని చెప్పాడు. ఇక కోహ్లీ చెప్పినట్లుగానే బాల్ వేసిన షమీ.. శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్‌తో వికెట్ రాబట్టి భారత శిభిరంలో ఉత్సాహాన్ని నింపాడు. అతను వేసిన 64 ఓవర్ తొలి బంతిని ఫుల్లర్‌గా వేయగా.. రాస్ టేలర్ కవర్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్‌కు కనెక్ట్ అయినా.. షార్ట్ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ సూపర్ డైవ్‌తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దాంతో టేలర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి హెన్రీ నికోల్స్(6 బ్యాటింగ్) రాగా.. న్యూజిలాండ్ 66 ఓవర్లు పూర్తయ్యే సరికి 3 వికెట్లకు 128 రన్స్ చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(15 బ్యాటింగ్) ఉన్నాడు.