
న్యూజిలాండ్‌కు కొంచెం..
ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ కూడా తన అంచనాను వెల్లడించాడు. ఈ ఫైనల్లో భారత్ కంటే కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్‌కే విజయావకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నట్లు ఈ ఆసీస్ దిగ్గజం అభిప్రాయపడ్డాడు. అయితే భారత జట్టులో కూడా మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, కానీ ఇంగ్లండ్ పిచ్‌లు కివీస్‌కు సరిపోతయి కాబట్టే ఆ జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఉందని చెబుతున్నానని తెలిపాడు. అయితే ఏ జట్టు బౌలింగ్ అద్భుతంగా చేస్తుందో ఆ టీమ్‌నే విజయం వరిస్తుందన్నాడు. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని కూడా తెలిపాడు.

కివీస్‌కు సరిపోయే పిచ్‌లు..
'ఇంగ్లండ్ పిచ్‌లు కివీస్‌కు సరిపోతాయి. ఎందుకంటే ఇక్కడి పిచ్‌పై వారు బ్యాటింగ్ చేస్తుంటే అది వారి స్వదేశంలో ఆడినట్టుగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ కీలకంగా మారనుంది. ఫాస్ట్ బౌలింగ్‌కు, బంతిని స్వింగ్ చేసేందుకు ఈ పిచ్ అనుకూలంగా ఉండొచ్చు. వీటన్నింటిని పరిశీలిస్తే న్యూజిలాండ్‌కే కాస్త ఎక్కువ అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే, ఇరు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి. రెండు జట్ల ఆటగాళ్లు స్వింగ్ బౌలింగ్‌ని బాగా ఆడగలరు. బౌలింగ్‌లో ఏ జట్టు ఉత్తమ ప్రదర్శన ఇస్తుందో ఆ జట్టే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుంది' అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.

ఇద్దరిలో ఎవరూ..
విరాట్ కోహ్లీ, విలియమ్సన్ కెప్టెన్సీల గురించి మాట్లాడుతూ..'కేన్ విలియమ్సన్‌కు గొప్ప క్రికెట్ బ్రెయిన్ ఉంది. అంతేకాకుండా బోరింగ్ లేని కెప్టెన్. అవసరమున్నప్పుడు మాత్రమే మెదడుకు పదును పెట్టి ఆలోచిస్తాడు. ఓపిక కూడా ఎక్కువ. అది అతనికి, కివీస్‌కు అనుకూలంగా మారుతుంది. విరాట్ కోహ్లీ దూకుడైన కెప్టెన్. వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అని చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నేను సంప్రదాయ, దూకుడైన కెప్టెన్ల కింద ఆడాను' అని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు.

కామన్ పాయింట్ అదే..
న్యూజిలాండ్, భారత్‌కు ఐసీసీ ఈవెంట్స్ కలిసి రావడం లేదని, ఇదే కామన్ పాయింట్ అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. 'ఇరు జట్లకు ఐసీసీ మేజర్ ఈవెంట్స్ ఇప్పటివరకు కలిసిరాలేదు. ఇద్దరు నాయకత్వం వహించిన జట్లు ఐసీసీ ప్రధాన టోర్నీలో చతికిలపడ్డాయి. అయితే తొలిసారి జరుగుతున్న టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఐసీసీ ఎవరో ఒకరిని విజేతగా చూడాలనే పట్టుదలతో ఉంది.. చూద్దాం విజయం ఎవరిని వరిస్తుందో'అని ముగించాడు. టీమిండియా 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, 2017 చాంపియన్స్ ట్రోఫీ రన్నరప్, 2019 వరల్డ్ కప్ సెమీస్‌కే వరుసగా అవకాశాలు చేజార్చుకుంది. మరోపై న్యూజిలాండ్ పరిస్థితి కూడా అదే.


Click it and Unblock the Notifications












