వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2025 ఫైనల్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానం వేదికగా సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో పేసర్లు నిప్పులు చెరిగారు. దాంతో తొలి రోజే 14 వికెట్లు పడ్డాయి. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా(5/51), మార్కో యాన్సెన్(3/49) రఫ్ఫాడించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే కుప్పకూలింది.
బ్యూ వెబ్‌స్టర్(92 బంతుల్లో 11 ఫోర్లతో 72), స్టీవ్ స్మిత్(112 బంతుల్లో 10 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీలతో ఆసీస్‌ను ఆదుకున్నారు. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(0), మార్నస్ లబుషేన్(17)తో పాటు కామెరూన్ గ్రీన్(4), ట్రావిస్ హెడ్(11), అలెక్స్ క్యారీ(23), ప్యాట్ కమిన్స్(1), మిచెల్ స్టార్క్(1) నిరాశపరిచారు. పిచ్ నుంచి పేసర్లకు సహకారం లభించడంతో బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు.

మరోవైపు బౌలర్లు అందించిన సహకారాన్ని సౌతాఫ్రికా బ్యాటర్లు అందిపుచ్చుకోలేకపోయారు. మిచెల్ స్టార్క్(2/10), జోష్ హజెల్ వుడ్(1/10), ప్యాట్ కమిన్స్(1/14) చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(0), ర్యాన్ రికెల్టన్(16), వియాన్ మల్డర్(6), ట్రిస్టన్ స్టబ్స్(2) తీవ్రంగా నిరాశపరిచారు. క్రీజులో కెప్టెన్ టెంబా బవుమా(3 బ్యాటింగ్)తో పాటు డేవిడ్ బెడింగ్‌హమ్(8) ఉన్నారు. రెండో రోజు సౌతాఫ్రికా బ్యాటుతో ఏమేర పోరాడుతుందన్నదానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది.
ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన కగిసో రబడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతను అలన్ ఆంథోని డొనాల్డ్‌ను అధిగమించాడు. డొనాల్డ్ 72 టెస్ట్‌ల్లో 330 వికెట్లు తీయగా.. రబడా 71 టెస్ట్‌ల్లో 333 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డేల్ స్టెయిన్(439), షాన్ పొలాక్(421) ఎన్తిని(390) రబడా కంటే ముందున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ చరిత్రలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న రెండో బౌలర్‌గా రబడా నిలిచాడు. గతంలో న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ ఈ ఫీట్ సాధించాడు.