న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించిన థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులే కాకుండా దిగ్గజ ఆటగాళ్లు సైతం సోషల్ మీడియా వేదికగా థర్డ్ అంపైర్‌ను ఏకీపారేస్తున్నారు.
సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే టీమిండియా మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, వసీం జాఫర్‌లు ట్విటర్ వేదికగా ఈ తప్పుడు నిర్ణయంపై తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్ చేశాడని కళ్లకు గంతలు కట్టుకున్న ఫొటోతో సెహ్వాగ్ ఫన్నీ మీమ్ షేర్ చేయగా.. ఒంటి కన్నుతో అంపైరింగ్ చేశాడని జాఫర్ విమర్శలు గుప్పించాడు.

'శుభ్‌మన్ గిల్ వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకొని నిర్ణయం తీసుకున్నాడు. స్పష్టమైన ఆధారాలు లేనప్పుడు, సందేహం ఉన్నప్పుడు నౌటౌట్ ఇవ్వాలి.'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ఈ వికెట్ సమయంలో కామెంట్రీ చెబుతున్న రికీ పాంటింగ్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సైతం అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. హర్షా భోగ్లే సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అసలేం జరిగిందంటే.. టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా స్కాట్ బోలాండ్ వేసిన 8వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ ఓవర్ తొలి బంతిని బోలాండ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. గిల్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ ఫీల్డర్ వైపు దూసుకెళ్లింది. కామెరూన్ గ్రీన్ సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించింది.
వెంటనే ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు క్యాచ్ ఔట్ విషయంలో క్లారిటీ లభించలేదు. కానీ క్యాచ్ అందుకునే క్రమంలో గ్రీన్ చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ ఔటిచ్చాడు. క్యాచ్ పూర్తి చేసే క్రమంలో బంతిని నేలకు రుద్దినట్లు కనిపించింది. దాంతో ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది.
444 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 93 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే 65 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.