లండన్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్.. డబ్ల్యూటీసీలో శతకం బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో భారత బౌలర్లను చెడుగుడు ఆడిన ట్రావిస్ హెడ్.. 106 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విదేశాల్లో ట్రావిస్ హెడ్‌కు ఇదే తొలి సెంచరీ.
స్టీవ్ స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 200 ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పిన ట్రావిస్ హెడ్.. పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో 100+, 200+ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ట్రావిస్ హెడ్‌కు తోడుగా స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. షాట్ పిచ్ బాల్స్ వేసినా.. ఫీల్డ్ సెటప్‌తో ఉచ్చు బిగించినా.. బౌలర్లు మార్చినా ఫలితం లేకపోయింది. ఈ ఇద్దరి బ్యాటింగ్‌తో భారత బౌలర్లలో నిరాశ ఆవహించింది. దాంతో లూజ్ బాల్స్ వేస్తూ పరుగులు సమర్పించుకుంటున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ శుభారంభం అందించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన లబుషేన్‌తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో కాస్త తడబడిన ఈ జోడీ.. ఉమేశ్ యాదవ్ పేలవ బౌలింగ్‌తో క్రీజులో సెట్ అయ్యింది.
హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న డేవిడ్ వార్నర్(43)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడంతో ఆసీస్ 73/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్ ఆరంభంలోనే లబుషేన్(26)ను మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ట్రావిస్ హెడ్.. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టాడు.
మరో ఎండ్‌లో స్మిత్ నిదానంగా ఆడినా.. ట్రావిస్ హెడ్ చెలరేగాడు. తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకున్నాడు. ఈ క్రమంలో 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్ అనంతరం అదే జోరు కొనసాగించాడు. స్మిత్ కూడా 144 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తిరుగులేకుండా పోయింది. ఆ కొద్ది సేపటికే సెంచరీ పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.