లండన్: భారత్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. 123/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. క్రీజులో అలెక్స్ క్యారీ(41), మిచెల్ స్టార్క్(11) ఉన్నారు. ఇప్పటికే 374 పరుగుల లీడ్ సాధించిన ఆ జట్టు భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది.
అయితే ఫస్ట్ సెషన్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో ఆసీస్ బ్యాటర్లు భారత బౌలర్లను తెగ విసిగించారు. మార్నస్ లబుషేన్‌ను ఉమేశ్ యాదవ్ త్వరగానే ఔట్ చేసినా.. క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీతో కలిసి కామెరూన్ గ్రీన్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో తీవ్ర అసహనానికి గురైన సిరాజ్.. రాకాసి బౌన్సర్లతో ఆసీస్ బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో సిరాజ్ వేసిన డేంజరస్ బౌన్సర్ కామెరూన్ గ్రీన్ భుజానికి బలంగా తాకింది.

వెంటనే అతని దగ్గరకు వెళ్లిన సిరాజ్.. హైదరాబాద్ స్టైల్లో కన్నెర్ర చేస్తూ ధమ్కీ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు.
అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు కుప్పకూలింది. అజింక్యా రహానే(129 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 89), శార్దూల్ ఠాకూర్(109 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకోగా.. రవీంద్ర జడేజా(51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48) విలువైన పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీసాడు. నాథన్ లయన్ ఓ వికెట్ పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ జట్టు ఆధిక్యం 443 ధాటింది.