న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 ముంగిట భారత సెలెక్షన్ కమిటీకి బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక సలహా ఇచ్చాడు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు సీనియర్ వికెట్ కీపర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ అందుబాటులో లేనందున అనుభవజ్ఞుడైన వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు అవకాశం కల్పించాలని సూచించాడు.
ఆ దిశగా సెలక్టర్లు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో వెటరన్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాకు చోటివ్వలేదు. అతనికి బదులు కేఎస్ భరత్, కేఎల్ రాహుల్‌లను కీపర్లుగా ఎంపిక చేశారు. అయితే తొడ కండరాల గాయంతో రాహుల్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. దాంతో అతనికి రిప్లేస్‌మెంట్‌గా భరత్‌కు బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు.

రెడ్ బాల్ క్రికెట్‌లో ఇషాన్ కిషన్‌కు పెద్దగా అనుభవం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కేఎస్ భరత్ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. ఈ క్రమంలోనే సాహాను ఆడిస్తే జట్టుకు మేలు జరుగుతుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
'డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో వృద్దిమాన్ సాహాకు అవకాశం వస్తే నేను సంతోషిస్తా. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేఎస్ భరత్ ఆడాడు. వృద్ధిమాన్ సాహాకు ఎన్నో టెస్టులు ఆడిన అనుభవం ఉంది. కానీ, రిషభ్ పంత్ రాణించడంతో అతనికి అవకాశం రాలేదు. ఇది పూర్తిగా సెలక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంది.
ఈ మ్యాచ్‌లో భాతర్ గెలవాలని కోరుకుంటున్నా. మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారో అంచనా వేయడం కష్టం. కానీ భారత్ విజయం సాధించాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం ఇరు జట్లకు 50-50 ఛాన్స్ ఉంది.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు. జూన్ 7-11 మధ్య లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరిగే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం భారత్‌కు రెండో సారి కాగా.. ఆస్ట్రేలియా మొదటిసారి. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్ వేదికగానే జరిగిన డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. వర్షం ప్రభావం చూపిన ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన పేలవ బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది.
ఈక్రమంలోనే ఈ సారి డబ్ల్యూటీసీ ఫైనల్లో కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉంది.