లండన్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ(15) దారుణంగా విఫలమయ్యాడు.
ఆస్ట్రేలియా చేసిన 469 పరుగుల భారీ స్కోర్‌ను అధిగమించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్‌గా అదిరిపోయే ఆరంభంతో భారీ స్కోర్‌కు బాటలు వేయాల్సిన రోహిత్.. 15 పరుగులే చేసి వెనుదిరిగాడు. కమిన్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే శుభ్‌మన్ గిల్(15) కూడా క్లీన్ బౌల్డ్ అవ్వడంతో భారత్ తీవ్ర ఒత్తిడికి లోనైంది.

ఓపెనర్ల వైఫల్యం కారణంగా క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా, కోహ్లీ స్వేచ్చగా ఆడలేకపోయారు. ఎలాగోలా తంటాలు పడుతూ మరోవికెట్ పడకుండా రెండో సెషన్‌ను ముగించారు. కానీ చివరి సెషన్ ప్రారంభంలోనే పుజారా(14) కూడా ఔటవ్వడంతో భారత్ 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో కోహ్లీ, రహానే ఉన్నప్పటికీ.. టీమిండియా కమ్ బ్యాక్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.
టీమిండియా పేలవ బ్యాటింగ్‌కు ప్రధాన కారణం ఓపెనర్ల వైఫల్యమే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మల్లో ఒక్కరు క్రీజులో నిలబడినా పరిస్థితి మరోలా ఉండేదని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మపై జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్‌కు దిగుతున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ రాదని, బ్యాటింగ్ చేతకాదని, ఫిట్‌నెస్ కూడా ఉండదని, వెంటనే ఆట నుంచి తప్పుకోవడం టీమిండియాకు శ్రేయాస్కరమని ఘాటుగా విమర్శిస్తున్నారు.
వాస్తవానికి విరాట్ కోహ్లీ సారథ్యంలో ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మనేనని, 2017 డబ్ల్యూటీసీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి రోహిత్ శర్మ వైఫల్యమే కారణమని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
అనవసరంగా విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించారని, రోహిత్ శర్మను పక్కనపెట్టి మరో యువ ప్లేయర్‌ను ఓపెనర్‌గా తీర్చిదిద్దుకోవాల్సిందని కామెంట్ చేస్తున్నారు.