న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ టీమిండియా తుది జట్టులో ఉంటారని చెప్పాడు. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా బుధవారం నుంచి ఈ మెగా ఫైనల్ ప్రారంభంకానుండగా.. ఆస్ట్రేలియా, భారత్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఇప్పటికే ఇరు జట్లు లండన్ చేరి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుండగా.. టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా? లేక ఎక్స్‌ట్రా పేసర్‌తో ఆడుతుందా? అనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే చాలా మంది మాజీ ఆటగాళ్లు ఈ అంశంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

రవి శాస్త్రి వంటి మాజీ ఆటగాళ్లు ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలని సూచించగా.. ఇర్ఫాన్ పఠాన్ వంటి ప్లేయర్లు మాత్రం పిచ్ కండిషన్స్ బట్టి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ మాత్రం టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని చెప్పాడు.
'రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను భారత్ తుది జట్టులోకి తీసుకుంటుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో జడేజా ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగలడు. అతని బ్యాటింగ్ ఎంతగానో మెరుగుపడింది. బౌలింగ్ కూడా బాగా చేస్తాడు. కాబట్టి.. అతన్ని కచ్చితంగా జట్టులోకి తీసుకుంటుందని అనుకుంటున్నా. జడేజా కంటే అశ్విన్ చాలా నైపుణ్యం ఉన్న, మెరుగైన టెస్ట్ బౌలర్ అనడంలో సందేహం లేదు.

లోయర్ ఆర్డర్‌లో జడేజా బ్యాటింగ్‌లో రాణిస్తే ఆట నాలుగు లేదా ఐదో రోజు వరకు వెళ్లొచ్చు. అలా కాకుండా పిచ్ స్పిన్‌కు అనుకూలంగా మారితే భారత్‌కు రెండో స్పిన్నర్‌గా జడేజా రూపంలో మంచి బౌలర్ ఉంటాడు. నేనైతే జడేజాను కచ్చితంగా ఎంపిక చేస్తాను'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా మాత్రం ఏకైక స్పిన్నర్ నాథన్ లయన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది.