హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ తుది దశకు చేరుకుంది. సక్సెస్‌ఫుల్‌గా లీగ్ దశ ముగియగా.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. చివరి నిమిషంలో ఆర్‌సీబీ రేసులో నుంచి తప్పుకుంది.
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మంగళవారం క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుండగా.. బుధవారం ముంబై, లక్నో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. శుక్రవారం క్వాలిఫయర్-2 జరగనుండగా మే 28న జరిగే ఫైనల్‌తో ఈ ధనాధన్ లీగ్‌కు తెరపడనుంది. ఓ వైపు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరుగుతుండగానే మరోవైపు టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రిపరేషన్స్‌ను ప్రారంభించనుంది.

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చేరని ఆటగాళ్లతో కూడిన తొలి బ్యాచ్ మంగళవారం లండన్ ఫ్లైట్ ఎక్కనుంది. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్దం కానుంది. ప్లే ఆఫ్స్ ఆడుతున్న ఆటగాళ్లు.. తమ మ్యాచ్‌లు ముగిసిన వెంటనే ఒక్కక్కొరుగా లండన్ బయల్దేరనున్నారు.
తొలి బ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్‌లతో పాటు. నెట్ బౌలర్లు అనికేత్ చౌదరి, ఆకాశ్ దీప్, యర్ర పృథ్వీరాజ్ కూడా లండన్ ఫ్లైట్ ఎక్కనున్నారు.
మంగళవారం 4.30 గంటలకు భారత ఆటగాళ్లు లండన్‌కు బయల్దేరుతారని బీసీసీఐ అధికారులు తెలిపారు. గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌కు దూరమైన జయదేవ్ ఉనాద్కత్ కూడా ఫస్ట్ బ్యాచ్‌తోనే లండన్ వెళ్లనున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకున్నా.. అతన్ని ఇంగ్లండ్‌కు పంపిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించాడు.
'జట్టుతో జయదేవ్ ఉనాద్కత్ కూడా వెళ్తున్నాడు. అతని రిహాబ్‌ను పూర్తి చేసుకునే దశలో ఉన్నాడు. ఇంకా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించకపోయినప్పటికీ, తక్కువ సామర్థ్యంతో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తదుపరి వారంలో లోపు అతను ఫిట్ అవ్వనున్నాడు.'అని సదరు అధికారి పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ ఆడనున్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, మహమ్మద్ షమీ, కేఎస్ భరత్, అజింక్యా రహానే ఆలస్యంగా వెళ్లనున్నారు. ఇప్పటికే లండన్‌లో ఉన్న చతేశ్వర్ పుజారా భారత జట్టుతో కలవనున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ కిషన్
స్టాండ్‌బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్