హైదరాబాద్: ఐసీసీ టోర్నీలో టీమిండియాకు కలిసి రావడం లేదు. కెప్టెన్ మారినా.. కొత్త కోచ్ వచ్చినా ఫలితం మాత్రం మారడం లేదు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా తొమ్మిదో సారి టీమిండియా ఐసీసీ టైటిల్‌ను చేజార్చుకుంది. అప్పుడెప్పుడో దశాబ్దకాలం క్రితం చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా.. మళ్లీ ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. 2013లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత వరుసగా ఓటమిపాలైంది.
మొత్తం 9 ఐసీసీ ట్రోఫీలు ఆడిన టీమిండియా నాలుగు సార్లు ఫైనల్లో మరో నాలుగు సార్లు సెమీఫైనల్లో వెనుదిరిగింది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిన టీమిండియా.. 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఖంగుతిన్నది. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్లో ఓటమిపాలైంది.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దాయాదీ పాకిస్థాన్ చేతిలో చిత్తయ్యింది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా.. అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిదారిపట్టింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), అంజిక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కగా.. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది.
సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 469 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 296 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 270/8 డిక్లేర్
భారత్ రెండో ఇన్నింగ్స్ 234 ఆలౌట్