లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ పోరాటం ముగిసింది. 151/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు కుప్పకూలింది.
అజింక్యా రహానే(129 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 89), శార్దూల్ ఠాకూర్(109 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకోగా.. రవీంద్ర జడేజా(51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48) విలువైన పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీసాడు. నాథన్ లయన్ ఓ వికెట్ పడగొట్టాడు.
మూడో రోజు ఆట రెండో బంతికే ఓవర్‌నైట్ బ్యాటర్ కేఎస్ భరత్(5) ఔటయ్యాడు. బోలాండ్ వేసిన బంతికి భరత్ క్రీజులో నిలబడలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్‌తో కలిసి అజింక్యా రహానే ఇన్నింగ్స్‌ను ముందుకునడిపించాడు. ఈ క్రమంలో అతను 92 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ శార్దూల్ ఠాకూర్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా 260/6 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
రెండో సెషన్ ప్రారంభంలోనే రహానేను కామెరూన్ గ్రీన్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో కమిన్స్ పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో ఏడో వికెట్‌క నమోదైన 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్(5)ను కమిన్స్ బౌల్డ్ చేయగా.. మహమ్మద్ షమీ సాయంతో శార్దూల్ ఠాకూర్ 108 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఓవల్ మైదానంలో శార్దూల్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. అనంతరం భారీ షాట్ ఆడే ప్రయత్నంలో శార్దూల్ ఠాకూర్(5), మహమ్మద్ షమీ(13) పెవిలియన్ చేరడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.