లండన్: క్రికెట్‌లో నోబాల్ వేయడాన్ని ఓ పెద్ద నేరంగా భావిస్తారు. ఎందుకంటే నోబాల్స్ వల్ల ఫలితాలు తారుమారు అవుతాయి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జస్‌ప్రీత్ బుమ్రా వేసిన నోబాల్ టీమిండియా టైటిల్ గెలవకుండా చేసింది. ఆ ఒక్క సందర్భమే కాదు.. చాలా మ్యాచ్‌ల్లో నోబాల్స్ కారణంగా సునాయసంగా గెలిచే జట్లు ఓటమిపాలయ్యాయి.
తాజాగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇదే తప్పిదం చేశాడు. ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు నోబాల్స్ వేసి ఆసీస్‌కు తీవ్ర నష్టం చేశాడు. ఈ రెండు సార్లు భారత్ వికెట్ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. అది కూడా ఆసీస్ ఓపికను పరీక్షిస్తున్న రహానే, శార్దూల్ ఠాకూర్‌ల వికెట్లను తీసే అవకాశాలను చేజార్చుకుంది.

రెండో రోజు ఆటలో కమిన్స్ వేసిన 22 ఓవర్‌లో రహానే వికెట్లు ముందు దొరికిపోగా.. అంపైర్ ఔటిచ్చాడు. వెంటనే రహానే రివ్యూ తీసుకోగా.. రిప్లేలో కమిన్స్ నోబాల్ వేసినట్లు తేలింది. దాంతో రహానే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అప్పుడు రహానే వ్యక్తిగత స్కోర్ 17 పరుగులు మాత్రమే. ఇది లీగల్ డెలివరీ అయ్యి.. రహానే ఔటయ్యుంటే టీమిండియా ఇన్నింగ్స్ 200లోపే ముగిసేది. ఈ అవకాశంతో చెలరేగిన రహానే హాఫ్ సెంచరీతో జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందించాడు.
మూడో రోజు ఆటలో శార్దూల్ ఠాకూర్ కూడా కమిన్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా అంపైర్ ఔటిచ్చాడు. టీమిండియా వెంటనే రివ్యూ తీసుకోగా.. రిప్లేలో నోబాల్‌గా తేలింది. దాంతో శార్దూల్ ఠాకూర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
151/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 260/6 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్ ప్రారంభంలోనే క్రీజులో పాతుకుపోయిన రహానే(89)ను కామెరూన్ గ్రీన్ సూపర్ క్యాచ్ సాయంతో కమిన్స్ పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో ఏడో వికెట్‌కు నమోదైన 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్(1)తో శార్దూల్ ఠాకూర్ పోరాడుతున్నాడు.
ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీసారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.