హైదరాబాద్: ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన ప్రతీసారి టీమిండియాకు నిరాశే ఎదురైంది. ఒకటి కాదు.. రెండు కాదు రెండు ఫైనల్స్, ఓ సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. కాకతాళీయమో ఏమో కానీ ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా లక్ష్యాన్ని చేధించలేక చేతులెత్తేసింది. అదేందో కానీ ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒకే తరహా పరుగులు నమోదు చేసింది.
సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తొలిసారి తలపడగా.. 125 పరుగుల భారీ తేడాతో ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 359 పరుగులు చేసింది. అనంతరం భారత్ 39.2 ఓవర్లలో 234 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది. భారత బ్యాటింగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్(82) మినహా మరే బ్యాటర్ రాణించలేదు.

2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలోనే టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 328 పరుగులు చేయగా.. భారత్ 233 పరుగులకే కుప్పకూలింది.
తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో పేలవ ప్రదర్శనతో 209 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), అంజిక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కగా.. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో భారత్ 234 పరుగులకే కుప్పకూలండం చర్చనీయాంశమైంది.