హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో పేలవ ప్రదర్శనతో 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పేలవ బ్యాటింగ్, పసలేని బౌలింగ్, లాక్ ఆఫ్ ప్రిపరేషన్, ప్రతికూల పరిస్థితులు టీమిండియా ఓటమిని శాసించాయి. దాంతో వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా టీమిండియా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.
1. అశ్విన్‌ను తీసుకోకపోవడం..:ఈ మ్యాచ్‌లో టీమిండియా పిచ్ కండిషన్స్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయింది. గ్రీన్ టాప్ వికెట్, మబ్బులను చూసి గుడ్డిగా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో పాటు తుది జట్టులోని వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌ను తీసుకోలేదు. ఈ తప్పిదాలు టీమిండియా పతనాన్ని శాసించాయి. ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉన్న అశ్విన్ తుది జట్టులో ఉంటే ఫలితం మరోలా ఉండేది.

ముఖ్యంగా స్మిత్‌పై అతనికి మంచి రికార్డు ఉంది. అంతేకాకుండా నాలుగో రోజు పిచ్ స్పిన్నర్లకు అనుకూలించింది. నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ తుది జట్టులో ఉంటే బౌలింగ్‌తో పాటు లోయరార్డర్ బ్యాటింగ్‌లో కీలకమయ్యేవాడు.
2. పేలవ బ్యాటింగ్..:ఐసీసీ కీలక మ్యాచ్‌ల్లో టీమిండియా ప్రధాన ఆటగాళ్లు విఫలమవడం కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా దారుణంగా విఫలమయ్యారు. ఐపీఎల్ మత్తును వీడలేకపోయారు. ఓపికగా బ్యాటింగ్ చేయలేక అనవసరపు షాట్లతో మూల్యం చెల్లించుకున్నారు. రోహిత్, విరాట్, శుభ్‌మన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో అవసరం లేని షాట్లతో వెనుదిరిగారు.
టీమిండియా రన్ రేట్ చూస్తేనే మన బ్యాటర్లు దూకుడు అర్థమవుతుంది. రహానే ఒక్కడే కాస్తో కూస్తో పోరాడాడు. పుజారా వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఐపీఎల్ ఆడకుండా కౌంటీ క్రికెట్ ఆడిన పుజారా.. ఆ అనుభవాన్ని ఈ మ్యాచ్‌లో ఉపయోగించలేకపోయాడు. మరోవైపు స్మిత్, లబుషేన్ మాత్రం ఆసీస్ తరఫున రాణించారు.
3. పసలేని బౌలింగ్..:బౌలర్ల వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది. పేస్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై కూడా బౌలర్లు రాణించలేకపోయారు. సిరాజ్ ఆరంభంలో వికెట్లు తీసినా.. తర్వాత ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. పదే పదే ఆసీస్ బ్యాటర్లను తన మాటలతో రెచ్చగొట్టిన సిరాజ్.. బౌలింగ్‌లో మాత్రం ఆ దూకుడు కనబర్చలేకపోయాడు. మహమ్మద్ షమీ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.
ఉమేశ్ యాదవ్ వైఫల్యం ఇతర బౌలర్ల ప్రదర్శనను దెబ్బతీసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 464 పరుగులు చేయడానికి బౌలర్ల చెత్త ప్రదర్శనే కారణం. రెండో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోర్‌కు కట్టడి చేయలేకపోయారు. వికెట్ టేకింగ్ డెలివర్లు అయిన యార్కర్లు వేసే ప్రయత్నమే చేయలేదు.
4. ప్రతికూల పరిస్థితులు...:ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి రావడం టీమిండియా కొంపముంచింది. కనీసం 20 రోజుల సమయం ఉన్నా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడినా కాస్త మెరుగ్గా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం దక్కేది. అంతేకాకుండా తటస్థ వేదిక అంటూ ఇంగ్లండ్‌లో ఈ మ్యాచ్ నిర్వహించడం టీమిండియాకు నష్టం చేసింది. ఇంగ్లండ్ పిచ్‌లు ఆసీస్ కండిషన్స్‌కు దగ్గరగా ఉండటం..టీమిండియా విజయవకాశాలను ప్రభావితం చేసింది.