
భారత బ్యాట్స్‌మెన్‌కు అగ్ని పరీక్ష..
'డబ్ల్యూటీసీ ఫైనల్ మాకు మరో మ్యాచ్ మాత్రమే'.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఇటీవల తరచుగా చెబుతున్న మాట ఇది. కానీ మెగా ఫైనల్ భారత ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు అగ్ని పరీక్ష కానుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. డబ్ల్యూటీసీలో భాగంగా భారత్ ఇప్పటి దాకా 17 టెస్ట్‌లు ఆడగా.. 12 విజయాలు సాధించింది. నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ డ్రాగా ముగించింది. అయితే భారత్ ఓడిన నాలుగులో రెండు న్యూజిలాండ్ చేతిలో ఎదురైనవి కావడం గమనార్హం.
ఇక, ఆ రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్‌లోనే జరిగాయి. ఇంగ్లండ్ పరిస్థితులు కివీస్‌కు దగ్గరగా ఉంటాయి. దీంతో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగుతున్న కోహ్లీ సేన.. ట్రెంట్ బౌల్ట్ ఆధ్వర్యంలో కివీస్ బౌలింగ్ అటాక్‌కు ఎలా బదులిస్తుందనేది ఆసక్తిగా మారింది.

అనుభవం లేని రోహిత్, గిల్..
మరోపక్క భారత టాప్ బ్యాట్స్‌మెన్ ఫామ్ కూడా కలవరపెడుతోంది. న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును గత మంగళవారం ప్రకటించింది. దీని ప్రకారం రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం ఖాయమైంది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటిదాకా ఇంగ్లండ్‌లో ఇన్నింగ్స్ ఓపెన్ చేసింది లేదు. రోహిత్ 2014లో ఇంగ్లండ్‌లో ఓ టెస్ట్ ఆడాడు. గిల్ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా లేదు. దీంతో ఇంగ్లిష్ కండిషన్స్‌లో అనుభవం లేని ఈ ఓపెనింగ్ కాంబో ఏం చేస్తారో ఊహించలేం.

బిగ్ త్రీ.. బిగ్ స్కోర్లు లేవు..
ఇక, బ్యాటింగ్ మూల స్థంభాలైన చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేకు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉంది. పైగా అక్కడ సెంచరీలు కూడా సాధించారు. పుజారా, రహానెకున్న కౌంటీ అనుభవం అదనపు అడ్వాంటేజ్ కానుంది. అయితే, ఈ త్రయం ప్రస్తుత ఫామ్ కాస్త కలవరపెడుతోంది. వీళ్ల నుంచి అదిరిపోయే పెర్ఫామెన్స్ వచ్చి చాలా కాలమైంది. ఆసీస్ టూర్‌లో ఒక టెస్ట్ ఆడిన విరాట్.. సొంతగడ్డపై జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లోనూ తన స్థాయి చూపెట్టలేకపోయాడు. ఇక, చాలా కాలం తర్వాత మెల్‌బోర్న్ టెస్ట్‌లో సెంచరీ చేసిన రహానే.. ఆ తర్వాత మళ్లీ మెరిసింది లేదు.
ఇక, ఆస్ట్రేలియా సిరీస్‌లో తనలోని పోరాటపటిమ చూపిన పుజారా.. రెండేళ్లుగా భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతూనే ఉన్నాడు. వీళ్లు విఫలమైనా లోయరార్డర్ బ్యాట్స్‌మెన్ పోరాటం వల్ల కీలక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో గట్టెక్కిన భారత్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. కానీ, ఇప్పుడు షూటౌట్ లాంటి ఫైనల్లో మాత్రం ఈ త్రయం బాధ్యత చూపెట్టాల్సిందే. కివీస్ బౌలర్ల సవాలుకు ధీటుగా బదులివ్వాల్సిందే. లేదంటే మొదటికే మోసం జరిగే ముప్పు ఉంది.

డబ్ల్యూటీసీలో భారత బ్యాట్స్‌మన్ పెర్ఫామెన్స్..
| ప్లేయర్ | మ్యాచ్‌లు | ఇన్నింగ్స్ | రన్స్ | బెస్ట్ | యావరేజ్ | సెంచరీలు |
| రహానే | 17 | 28 | 1095 | 115 | 43.80 | 3 |
| రోహిత్ | 11 | 17 | 1030 | 212 | 64.37 | 4 |
| కోహ్లీ | 14 | 22 | 877 | 254 | 43.85 | 2 |
| పుజారా | 17 | 28 | 818 | 81 | 29.21 | 0 |
| పంత్ | 11 | 18 | 661 | 101 | 41.37 | 1 |
| జడేజా | 10 | 13 | 469 | 91 | 58.62 | 0 |
| విహారి | 8 | 14 | 457 | 111 | 38.08 | 1 |
| గిల్ | 7 | 13 | 378 | 91 | 33.36 | 0 |


Click it and Unblock the Notifications
