
సౌతాంప్టన్: కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచిన భారత క్రీడా దిగ్గజం మిల్కా సింగ్‌కు భారత క్రికెట్ జట్టు ఘన నివాళులర్పించింది. ఆయన మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లంతా ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో బ్లాక్ రిబ్బన్స్ ధరించి బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత బ్యాటింగ్‌కు దిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు జాతీయా గీతాన్ని ఆలపించారు. ఈ టైమ్‌లో భారత ఆటగాళ్లంతా బ్లాక్ రిబ్బన్స్ ధరించి కనిపించారు.
ఇక ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో పరుగు పందేలతో, పతకాలతో దేశ ప్రతిష్టను పెంచిన దిగ్గజం మిల్కా సింగ్. పోస్ట్ కొవిడ్ సంబంధిత సమస్యలతో 91 ఏళ్ల వయసున్న ఆయన కన్నుమూయగా.. క్రీడా లోకం, దేశం ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది. ఇప్పటికే భారత మాజీ, ప్రస్తుతం ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా ఈ ఫ్లయింగ్ సిక్ సాధించిన ఘనతలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
గత నెలలో కొవిడ్ బారిన పడ్డ మిల్కాకు బుధవారం నెగెటివ్‌గా తేలింది. ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా క్షీణించింది. కరోనా సోకిన మిల్కాకు మొదట మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఓ వారం పాటు చికిత్స అందించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆయన ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో ఈ నెల 3న పీజీఐఎమ్‌ఈఆర్‌లో చేర్పించారు. వైరస్ కారణంగా ఆయన భార్య, 85 ఏళ్ల నిర్మల్ కౌర్ ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. పద్మశ్రీ అవార్డీ మిల్కాకు కుమారుడు జీవ్ మిల్కాసింగ్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మిల్కా ఆసియా అథ్లెటిక్స్‌లో నాలుగుసార్లు స్వర్ణం నెగ్గారు. 1958 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి గెలిచారు. 1960 రోమ్ ఒలింపిక్స్ 400 మీటర్ల పరుగులో త్రుటిలో పతకం కోల్పోయారు. ఫైనల్లో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. 1956, 1964 ఒలింపిక్స్‌లోనూ మిల్కా పోటీపడ్డారు. ప్లయింగ్ సిఖ్‌గా ప్రసిద్ధి చెందిన మిల్కాకు 1959లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు.