సొంతగడ్డపై సౌతాఫ్రికా మరో సిరీస్ విజయాన్నందుకుంది. అసాధారణ ప్రదర్శనతో శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 109 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.
348 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన శ్రీలంక 238 పరుగులకు కుప్పకూలింది. కేశవ్ మహరాజ్(5/76) ఐదు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించగా.. కగిసో రబడా, డేన్ పీటర్సన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కో జాన్సెన్‌కు ఓ వికెట్ దక్కింది.

శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ ధనుంజ డిసిల్వా(92 బంతుల్లో 7 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. కుశాల్ మెండీస్(76 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేయగా.. శ్రీలంక కూడా 328 పరుగులతో ధీటుగా బదులిచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 317 పరుగులు చేసి 348 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.
ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ అవకాశాలను సౌతాఫ్రికా మెరుగుపరుచుకుంది. తాజా విజయంతో పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా 6 విజయాలు, 63.33 విన్నింగ్ పర్సంటేజీతో అగ్రస్థానంలో నిలిచింది. డబ్ల్యూటీసీ సైకిల్‌లో సౌతాఫ్రికా మరో సిరీస్ ఆడనుంది. సొంతగడ్డపై డిసెంబర్ 26 నుంచి పాకిస్థాన్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారవుతోంది.
సౌతాఫ్రికా తాజా విజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. 60.71 విన్నింగ్ పర్సంటేజీతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతుండగా.. 57.29 విన్నింగ్ పర్సంటేజీతో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని మిగతా మూడు మ్యాచ్‌లను గెలవాలి. అప్పుడే ఎలాంటి సమీకరణాలు లేకుండా టీమిండియాకు ఫైనల్ బెర్త్ దక్కుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఓడినా టీమిండియా అవకాశాలు చేజారుతాయి.
ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 3-2తో గెలిస్తే.. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. భారత్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌ను శ్రీలంక 2-0తో గెలవాలి. శ్రీలంకపై టెస్ట్ సిరీస్ విజయంతో సౌతాఫ్రికా ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమవ్వగా.. మరో బెర్త్ కోసం భారత్, ఆసీస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.