ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు మరో ఘోర పరాజయం ఎదురైంది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా సోమవారం ముగిసిన నాలుగో టెస్ట్‌లో 184 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. 340 పరుగుల భారీ లక్ష్యచేధనకు బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగులకు కుప్పకూలింది.
యశస్వి జైస్వాల్(208 బంతుల్లో 8 ఫోర్లతో 84) ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్యాట్ కమిన్స్(3/28), స్కాట్ బోలాండ్(3/39) మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లయన్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ తలో వికెట్ తీసారు. మరో 12 ఓవర్ల పాటు భారత్ క్రీజులో కొనసాగి ఉండి ఉంటే ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి గట్టెక్కేది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమితో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆసీస్ ఆధిక్యంలో నిలిచింది. బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది.
ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. తాజా పరాజయంతో భారత్ విన్నింగ్ పర్సంటేజ్ 55.89 నుంచి 52.77కి పడిపోయింది. మరోవైపు ఆసీస్ తాజా విజయంతో విన్నింగ్ పర్సంటేజ్ 61.46 శాతానికి పెంచుకొని ఫైనల్ బెర్త్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.
మరోవైపు 66.67 విజయాల శాతంతో సౌతాఫ్రికా ఇప్పటికే ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ నెలకొంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో భారత్‌కు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కానీ ఆసీస్ మాత్రం మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. భారత్‌తో ఓ మ్యాచ్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కాలంటే జనవరి 3 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే సిడ్నీ టెస్ట్‌లో విజయం సాధించాలి. అంతేకాకుండా శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఆసీస్ కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడాలి. అప్పుడే భారత్‌కు ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. అలా కాకుండా శ్రీలంక-ఆస్ట్రేలియా రెండు టెస్ట్‌ల సిరీస్ డ్రా ముగిసినా.. భారత్‌కు ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటుంది. సిడ్నీ టెస్ట్‌లో ఓడితే మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ తప్పుకుంటుంది.