హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ అప్‌కమింగ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై పడింది. జూన్ 7-11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకున్నాయి. గత రెండేళ్లుగా సాగిన ఈ బిగ్ టోర్నీలో ఈ రెండు జట్లు టాప్ ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాకు ఇది తొలి ఫైనల్ కాగా.. టీమిండియా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. ఇంగ్లండ్ వేదికగానే డబ్ల్యూటీసీ 2019-21 ఎడిషన్ ఫైనల్ జరగ్గా.. న్యూజిలాండ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే గతేడాది చేజారిన డబ్ల్యూటీసీ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా సాధించాలని టీమిండియా భావిస్తోంది.

ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత, ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ జూన్ 7న మధ్యాహ్నం 3:30 గంటలకి ప్రారంభంకానుంది. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంకానుంది. స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన అన్నీ భాషల్లో ఈ మ్యాచ్ ప్రసారం కానుంది. ఇప్పటికే స్టార్ స్పోర్ట్స్ ఈ మ్యాచ్‌కు సంబంధించిన ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది.
లండన్‌లోని ఓవల్ పిచ్ భారత పరిస్థితులను కలిగి ఉంటుందని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. అక్కడి రికార్డులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ పిచ్ బ్యాటింగ్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉండనుంది. మ్యాచ్ జరిగే కొద్ది ఈ వికెట్‌పై టర్న్ లభించనుంది. అయితే ఈ మ్యాచ్ వర్షం గండం పొంచి ఉండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఓవల్‌లో తొలి నాలుగు రోజులు వర్షం పడే అవకాశాలు లేవని పేర్కొన్న అక్కడి వాతావరణ శాఖ.. ఐదో రోజు మాత్రం 56% వర్షం కురిసే చాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నప్పటికీ అభిమానుల ఆందోళనకు గురవుతున్నారు. ఐపీఎల్ 2023 ఫైనల్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించి అభిమానులను చికాకుకు గురి చేసింది. చివరకు రిజర్వ్ డే రోజు మ్యాచ్ నిర్వహించగా.. వర్షం అంతరాయంతో ఆలస్యంగా మ్యాచ్ ముగిసింది.
అర్థరాత్రి తర్వాత మ్యాచ్ ముగియడంతో చాలా మంది ప్రత్యక్షంగా మ్యాచ్‌ను చూడలేకపోయారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రిజర్వ్ డే ఉన్నప్పటికి ఇంగ్లండ్ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయినా.. ఫలితం తేలకుండా ముగిసినా ట్రోఫీని ఇరు జట్లు పంచుకోనున్నాయి. ఐపీఎల్ మాదిరి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టుకు టైటిల్ ఇవ్వరు.