లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్(41 బ్యాటింగ్), కామెరూన్ గ్రీన్(7 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ ఆధిక్యం 296 పరుగులకే చేరింది.
నాలుగో రోజు ఆటలో ఆసీస్ మరో 100 పరుగులు జోడిస్తే ఈ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధిస్తోంది. అంతకుముందు 151/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు కుప్పకూలింది. అజింక్యా రహానే(129 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 89), శార్దూల్ ఠాకూర్(109 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకోగా.. రవీంద్ర జడేజా(51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48) విలువైన పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీసాడు. నాథన్ లయన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(1)ను సిరాజ్ ఔట్ చేయగా.. ఉస్మాన్ ఖవాజా(13)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. మార్నస్ లబుషేన్‌తో ఆచితూచిన ఆడిన స్టీవ్ స్మిత్(34) కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
క్రీజులో డేంజరస్‌గా మారిన స్మిత్‌ను జడేజా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే సెంచరీ హీరో ట్రావిస్ హెడ్‌ను రిటర్న్ క్యాచ్‌తో బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌తో లబుషేన్ ఆచితూచి ఆడి మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను ముగించాడు.
ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు.