వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న టీమిండియా 54.16 విజయాల శాతంతో సౌతాఫ్రికాను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది.
ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 2 గెలిచి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. వెస్టిండీస్ గడ్డపై 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. తాజా సౌతాఫ్రికా పర్యటనలో 1-1తో సమం చేసుకుంది. దాంతో 26 పాయింట్లతో పాటు 54.16 విజయాల శాతంతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ పరాజయం అనంతరం స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు పాయింట్లు కోల్పోయిన టీమిండియా అగ్రస్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. రెండు రోజుల్లోనే ముగిసిన కేప్‌టౌన్ టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. 6 స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లే ఆడిన సౌతాఫ్రికా ఒకటి ఓడి మరొకటి గెలిచి 50 విన్నింగ్ పర్సంటేజ్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ కూడా 50 విజయాల శాతంతో మూడో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది.
బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా అత్యధికంగా ఏడు మ్యాచ్‌లు ఆడింది. 2025 జూన్ వరకు సాగే ఈ టోర్నీలో టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గత రెండు ఎడిషన్స్‌లో ఫైనల్ చేరిన టీమిండియా.. తృటిలో విజయాన్ని కోల్పోయింది.
తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా.. రెండో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఖంగుతిన్నది. ఇంగ్లండ్ వేదికగా ఈ మెగా ఫైనల్ జరగడం అక్కడి కండిషన్స్ టీమిండియాకు ప్రతికూలంగా ఉండటం నష్టం చేసింది.