
సౌతాంప్టన్: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ టైటిల్ పోరుకు మార్గం సుగుమం అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఫైనల్ శుక్రవారమే ప్రారంభం కావాల్సి ఉన్న వర్షం కారణంగా తొలి రోజు ఆట టాస్ పడకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఎంతో ఆశగా ఎదురు చూసిన అభిమానులు తీవ్ర నిరాశకు గరయ్యారు.
తొలిరోజు ఆట వర్షార్పణం కావడంతో రెండోరోజు ఆటైనా సవ్యంగా సాగుతుందో లేదోనన్న అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. కానీ వరుణుడు శాంతించాడు. ప్రస్తుతం సౌతాంప్టన్‌లో ఎండ కొడుతుందని, మరికొద్ది గంటల్లో మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ట్వీట్ చేశాడు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం సౌతాంప్టన్‌లోనే ఉన్న డీకే.. మైదానం ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. దీనికి 'సూర్యుడు నిద్ర లేచాడు'అని తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఫొటో ప్రకారం మైదానంలోని కవర్లను అయితే తొలగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం. శుక్రవారంతో పోలిస్తే శనివారం వాతావరణం మెరుగ్గా ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ కూడా పేర్కొంది.
ఉదయం కాస్త పొడిగానే ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. మధ్యాహ్నం, సాయంత్రం మాత్రం వర్షం ముప్పు పొంచివుంది. 60 శాతం వాన పడుతుందని వివిధ వాతావరణ వెబ్‌సైట్లు సూచిస్తున్నాయి. దీని ప్రకారం రెండు సెషన్ల ఆట అయితే కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉదయం కాబట్టి వాతావరణ శాఖ చెప్పినట్లు ఎండ కొడుతుంది. కానీ మధ్యాహ్న సమయంలో మళ్లీ చిరుజల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. చిరు జల్లులు పడితే మైదానాన్ని రెడీ చేసే ఎక్విప్ మెంట్ సౌతాంప్టన్‌లో ఉంది. కానీ భారీ వర్షం కురుస్తేనే మ్యాచ్‌కు ఆటంకం. మరీ ఈ రోజైన సజావుగా మ్యాచ్ జరుగుతుందో లేదో చూడాలి.