న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ కీపర్ వృద్దిమాన్ సాహాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. కుర్రాళ్ల కోసం ఈ వెటరన్ వికెట్ కీపర్ గొప్ప అవకాశాన్ని వదులుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టులో వికెట్ కీపర్‌గా సాహాకే అవకాశం ఇచ్చినా.. అతను సున్నితంగా తిరస్కరించినట్లు త్రిపుర సెలెక్టర్ జయంత్ దే తెలిపారు.
దులీప్ ట్రోఫీ అనేది భారత జట్టులోకి వద్దామనే యువ ఆటగాళ్ల కోసం నిర్వహించే టోర్నీ అని, తాను భారత్‌కు ఆడనప్పుడు ఆ స్థానంలో మరో యువకుడికి అవకాశం ఇస్తే బాగుంటుందని సాహా సూచించాడని జయంత్ దే చెప్పుకొచ్చారు. సాహా మాటలు తమను కదిలించాయని చెప్పాడు. దులీప్ ట్రోఫీ బరిలోకి దిగే ఈస్ట్ జోన్ జట్టు వివరాలను శనివారం ప్రకటించారు.

ఈ సందర్భంగా సాహా గురించి జయంత్ దే ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 'తొలుత వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను తీసుకోవడానికి ఈస్ట్‌జోన్ సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపగా.. అతను ఆడేందుకు ఆసక్తిగా లేనని చెప్పడంతో సెలెక్టర్లు డైలామాలో పడ్డారు. దీంతో సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాను సంప్రదించారు. అయితే అతను సున్నితంగా తిరస్కరించడంతో బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌కు అవకాశం ఇచ్చారు.
వృద్దిమాన్ సాహా నిజాయితీ అద్భుతం. తప్పకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. సాహా చెప్పిన మాటలు మమ్మల్ని కదిలించాయి. దులీప్ ట్రోఫీ అనేది భారత జట్టులోకి వద్దామనే యువ ఆటగాళ్ల కోసం నిర్వహించే టోర్నీ. తాను భారత్‌కు ఆడనప్పుడు ఆ స్థానంలో మరో యువ ఆటగాడికి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పాడు.'అని జయంత్‌దే తెలిపాడు.
ఈస్ట్ జోన్ టీమ్‌కు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. అతనికి డిప్యూటీగా షెహ్‌బాజ్ నదీమ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇప్పటికే సౌత్ జోన్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. హనుమ విహారి సారథ్యం వహించనున్న ఈ జట్టులో కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.
ఈస్ట్‌జోన్ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సంతాను మిశ్రా, సుదిప్ ఘరామి, రియన్ పరాగ్, ఏ. మజుందార్, బిపిన్ సౌరభ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కే కుషగ్రా (వికెట్ కీపర్), షహ్‌బాజ్ నదీమ్ (వికెట్ కీపర్), షహ్‌బాజ్ అహ్మద్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్, అనుకుల్ రాయ్, మురా సింగ్, ఇషాన్ పోరెల్