న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత స్టార్ రెజర్లు చేస్తున్న పోరాటంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ మైనర్‌తో పాటు ఏడుగురు రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ స్థానిక రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో భాగంగా ఈ నెల 18న విచారణ నిమిత్తం న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ సింగ్‌ను కోర్టు ఆదేశించింది. శుక్రవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. నిందితుడిపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. బ్రిజ్ భూషణ్‌తో పాటు వేటుకు గురైన డబ్ల్యూఎఫ్‌ఐ సహాయక కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

రెజ్లర్లను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ ఈ ఏడాది జనవరి నుంచి వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియా లాంటి స్టార్ రెజ్లర్లు దేశ రాజధాని ఢిల్లీలో ఉద్ధృతంగా ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఢిల్లీ పోలుసులు బ్రిజ్ భూషణ్‌పై కేసులు నమోదు చేశారు.
అమ్మాయిలను లైంగికంగా వేధించడంతో పాటు ఇతర అభియోగాల కింద ఒక ఎఫ్‌ఐఆర్, మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో చట్టం కింద మరో ఎఫ్‌ఐఆర్‌ను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. అయినా రెజ్లర్లు వెనక్కి తగ్గలేదు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. తాము సాధించిన పతకాలను గంగలో విసిరేసేందుకు సిద్దమయ్యారు.
ఇక జూన్ 15లోపు బ్రిజ్ భూషణ్‌పై ఛార్జీషీటు దాఖలు చేస్తామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ ఇవ్వడంతో రెజ్లర్లు ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించారు.