వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో జోరు కనబర్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఒక్కసారిగా ఢీలా పడింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కొట్టిన దెబ్బకు విలవిలలాడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడి డేంజర్ జోన్‌లో నిలిచింది.
మరోవైపు ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్(57 మ్యాచ్‌ల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 100) విధ్వంసకర శతకంతో 15 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ముంబై ఓడించింది. ఈ గెలుపుతో లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో ఎదురైన మ్యాచ్‌కు ముంబై ప్రతీకారం తీర్చుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నాట్ సీవర్ నాటు కొట్టుడుకు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. హీలీ మాథ్యూస్(39 బంతుల్లో 9 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(12 బంతుల్లో 20) దూకుడుగా ఆడింది. ఆర్‌సీబీ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు తీయగా.. నదినే డీక్లెర్క్, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ తీసారు.

అనంతరం ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 184 పరుగులు చేసింది. రిచా ఘోష్(50 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 90) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. గ్రేస్ హ్యారీస్(15), స్మృతి మంధాన(6), జార్జియో వోల్(9), గౌతమి నాయక్(1) తీవ్రంగా నిరాశపర్చారు. రిచా ఘోష్‌కు అండగా ఒక్క బ్యాటర్ రాణించినా ఫలితం మరోలా ఉండేది. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్(3/10) ఆర్‌సీబీ పతనాన్ని శాసించింది. షబ్నీమ్ ఇస్మాయిల్, అమెలియా కేర్ రెండేసి వికెట్లు తీయగా.. అమన్‌జోత్ కౌర్ ఒక వికెట్ తీసింది.
వరుసగా 5 విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆర్‌సీబీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి నేరుగా ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికిప్పుడు ఆర్‌సీబీకి వచ్చిన ప్రమాదం ఏం లేదు. యూపీ వారియర్స్‌తో గురువారం జరిగే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఏ జట్టుతో సంబంధం లేకుండా ఆర్‌సీబీ ఫైనల్ చేరుతుంది. కానీ ఆ జట్టులో కూడా ఓడితే మాత్రం.. గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఈ రెండు జట్లు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే 10 పాయింట్స్‌తో నిలుస్తాయి. ఇప్పటికే ఆర్‌సీబీ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. ఈ రెండు జట్లతో పోలిస్తే ఆర్‌సీబీ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా రన్‌రేట్ కాపాడుకుంటే ఆర్‌సీబీకి ఫైనల్ బెర్త్ దక్కుతుంది. కానీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఓడితే ఆర్‌సీబీ ఆత్మ విశ్వాసం దెబ్బతిననుంది. ఆర్‌సీబీ తమకు అలవాటైన రీతిలోనే ఒక్క మ్యాచ్ ఓడితే వరుసగా చేతులెత్తేస్తోంది. ఫైనల్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఆఖరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలవాలి.