వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం వడోదర వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ టోర్నీలో ఢిల్లీ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గత మూడు సీజన్లలో ఆ జట్టు ఫైనల్ చేరగా.. తృటిలో టైటిల్ మిస్సైంది.
రెండు సార్లు ముంబై ఇండియన్స్, మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. గురువారం జరిగే ఫైనల్లో మరోసారి ఆర్‌సీబీతో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సారి ఎలాగైనా టైటిల్ అందుకోవాలనే కసితో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41) దూకుడైన బ్యాటింగ్, చిన్నెల్లే హెన్రీ(3/35), నందని శర్మ(2/44) అసాధారణ బౌలింగ్ ప్రదర్శన ఢిల్లీకి విజయాన్ని అందించాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. బెత్‌మూనీ(51 బంతుల్లో 6 ఫోర్లతో 62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. జార్జియా వేర్‌హమ్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో చిన్నెల్లే హెన్రీ(3/35) మూడు వికెట్లు తీయగా.. నందని శర్మ(2/44) రెండు వికెట్లు పడగొట్టింది. మిన్ను మణి(1/23) ఒక వికెట్ తీసింది. తెలుగు తేజం శ్రీచరణి(0/25) ఒక్క వికెట్ తీయలేకపోయింది.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసి మరో 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. లిజెల్లే లీ(24 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 43), షెఫాలీ వర్మ(21 బంతుల్లో 7 ఫోర్లతో 31) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అనంతరం లారా వోల్వార్డ్ట్(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), జెమీమా రోడిగ్ర్స్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41) మరింత దూకుడుగా ఆడారు.
మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. విజయానికి 9 పరుగుల దూరంలో జెమీమా ఔటవ్వగా.. మరిజన్నే కాప్(4 నాటౌట్)తో కలిసి లారా విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. గుజరాత్ బౌలర్లలో జార్జియో వేర్‌హమ్(2/28) రెండు వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్ ఒక వికెట్ పడగొట్టింది.