వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 165 పరుగుల సాధారణ లక్ష్యానికే పరిమితమైంది. అన్నబెల్ సదర్లాండ్(3/34), శిఖా పాండే(2/14) అద్భుతమైన బౌలింగ్‌కు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తోడవడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకు కుప్పకూలింది.
ముంబై బ్యాటర్లలో నాట్ సివర్ బ్రంట్(59 బంతుల్లో 13 ఫోర్లతో 80 నాటౌట్) అజేయ హా ఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) దూకుడుగా ఆడింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో సదర్లాండ్ మూడు వికెట్లు తీయగా.. శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టింది. కాప్సే, మిన్ను మణి తలో వికెట్ తీసారు.

ముంబై ఓపెనర్లు హీలీ మాథ్యూస్(0), యస్తికా భాటియా తీవ్రంగా నిరాశపర్చగా.. నాట్ సీవర్‌తో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టును ఆదుకుంది. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో ముంబై 2 వికెట్లకు 41 పరుగులు చేసింది. అనంతరం ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదడంతో 10 ఓవరల్లోనే ముంబై 100 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్న హర్మన్‌ప్రీత్ కౌర్‌ను సదర్లాండ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
హర్మన్ ప్రీత్ కౌర్ వికెట్‌తో ముంబై ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు నాట్ సీవర్ ఒంటరి పోరాటం చేసింది. ఈ క్రమంలో 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఆమె.. స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకుంటూ జట్టు స్కోర్‌ను 160 పరుగులు ధాటించింది. కానీ మరో ఎండ్‌లో ఆమెకు సహకారం లభించలేదు. చివర్లో ఇద్దరు టెయిలండర్స్ రనౌటవ్వడంతో మరో 5 బంతులు ఉండగానే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది.