వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో రెండో సారి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. దాంతో టైటిల్ గెలవాలనే ఆ జట్టు కల మూడోసారి కూడా నెరవేరలేదు. వరుసగా మూడు సీజన్లలో ఫైనల్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఒత్తిడిని అధిగమించలేక ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. నాట్ సివర్ బ్రంట్(28 బంతుల్లో 4 ఫోర్లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఢిల్లీ బౌలర్లలో మరిజాన్ కాప్(2/11), జెస్ జొనస్సెన్(2/26), శ్రీ చరణి(2/43) రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసి ఓటమిపాలైంది. జెమీమా రోడ్రిగ్స్(21 బంతుల్లో 4 ఫోర్లతో 30), మరిజాన్ కాప్(25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో40), నికి ప్రసాద్(25 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 25 నాటౌట్) రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో అమెలియా కేర్(2/25) రెండు వికెట్లు తీయగా.. నాట్ సివర్ బ్రంట్(3/25) మూడు వికెట్లు పడగొట్టింది. షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, హీలీ మాథ్యూస్ తలో వికెట్ తీసారు.

మరిజాన్ కాప్ ఒంటరి పోరాటం..
150 పరుగుల లక్ష్యచేధనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం దక్కలేదు. వరుస ఓవర్లలో కెప్టెన్ మెగ్ లాన్నింగ్(13)తో పాటు షెఫాలీ వర్మ(4) పెవిలియన్ చేరారు. దాంతో పవర్ ప్లేలో ఢిల్లీ 2 వికెట్లకు 37 పరుగులే చేసింది. అనంతరం జెస్ జొనాస్సెన్(13), అన్నబెల్ సదర్లాండ్(2) కూడా ఔటవ్వడంతో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో జెమీమా ఆచితూచి ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసింది.
అయితే క్రీజులో సెట్ అయిన ఆమెను అమెలియా కేర్ పెవిలియన్ చేర్చింది. సారా బ్రైస్(5) కూడా ఔటవ్వడంతో.. నికి ప్రసాద్‌తో కలిసి మరిజాన్ కాప్ పోరాడింది. కానీ దూకుడుగా ఆడే క్రమంలో ఆమె 18వ ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. క్రీజులోకి వచ్చిన శిఖా పాండే గోల్డెన్ డకౌట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. చివర్లో నికీ ప్రసాద్ సిక్సర్‌తో ఉత్కంఠ రేపినా.. ముంబై బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేసి విజయాన్నందుకున్నారు.
చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్
అంతకుముందు ముంబై ఇండియన్స్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ ఆదుకుంది. తక్కువ స్కోర్లకే ఓపెనర్లు వెనుదిరిగ్గా.. నాట్ సీవర్ బ్రంట్‌తో కలిసి మూడో వికెట్‌కు 89 పరుగులు జోడించింది. అమెలియా కేర్ విఫలమైనా.. దూకుడుగా ఆడుతూ..33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. భారీ షాట్ ఆడే క్రమంలోనే హార్మన్ ప్రీత్ కౌర్ ఔటవ్వగా.. లోయరార్డర్ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో ముంబై 149 పరుగులకే పరిమితమైంది.
✌️ in ✌️
— Women's Premier League (WPL) (@wplt20) March 15, 2025
Nat Sciver-Brunt turning it around in a dramatic fashion ⚡️
Updates ▶ https://t.co/2dFmlnwxVj #TATAWPL | #DCvMI | #Final | @mipaltan pic.twitter.com/bwNyyaA7CB