వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో బెంగళూరు వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
బౌలింగ్‌లో సోఫీ మోలినక్స్(3/25), రేణుక సింగ్(2/14) సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (27 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 43), సబ్బినేని మేఘన(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36) సత్తా చాటి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులే చేసింది. దయాలన్ హేమలత(25 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31 నాటౌట్), హర్లీన్ డియోల్(31 బంతుల్లో 3 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో సోఫీ మోలినక్స్(3/25) మూడు వికెట్లు తీయగా.. రేణుక సింగ్(2/14) రెండు వికెట్లు పడగొట్టింది. జార్జియో వేర్‌హమ్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ.. స్మృతి మంధాన మెరుపు బ్యాటింగ్‌తో 12.3 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. గుజరాత్ బౌలర్లలో అష్లే గార్డెనర్, తనూజ కాన్వేర్‌ల తలో వికెట్ దక్కింది. స్వల్ప లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీకి.. ఓపెనర్ స్మృతి మంధాన అదిరిపోయే ఆరంభాన్ని అందించింది.
ఎదుర్కొన్న తొలి 4 బంతుల్లో మూడు బౌండరీలు బాదింది. సోఫీ డివైన్(6) విఫలమైనా.. సబ్బినేని మేఘనతో కలిసి గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడింది. హాఫ్ సెంచరీకి చేరువైన స్మృతి మంధానను తనూజ కాన్వేర్ రిటర్న్ క్యాచ్‌తో బోల్తా కొట్టింది. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్మృతి ఔటైనా.. ఎల్లిస్ పెర్రీ(14 బంతుల్లో 4 ఫోర్లతో 23 నాటౌట్) సాయంతో సబ్బినేని మేఘన విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.
ఈ మ్యాచ్‌కు కూడా ఆర్‌సీబీ అభిమానులు పెద్ద ఎత్తున్న హాజరయ్యారు. స్మృతి సేనకు అండగా నిలిచారు.