వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ సత్తా చాటింది. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ(6/15, 40 నాటౌట్) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో ఆర్‌సీబీ మూడో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై.. ఎల్లిస్ పెర్రీ(6/15) ధాటికి 19 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. హీలీ మాథ్యూస్(26), సజీవన్ సజన(30), ప్రియాంక బాలా(19 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఆర్‌సీబీ బౌలర్లలో ఎల్లిస్ పెర్రీతో పాటు సోఫీ మోలినెక్స్, ఆషా సోభనా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆర్‌సీబీ 15 ఓవర్లలోనే 3 వికెట్లకు 115 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన(11), సోఫీ మోలినక్స్(9), సోఫీ డివైన్(4) విఫలమైనా.. ఎల్లిస్ పెర్రీ(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40 నాటౌట్), రిచా ఘోష్(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) సత్తా చాటారు. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్ తలో వికెట్ తీసారు.

డబ్ల్యూపీఎల్ టోర్నీ రూల్స్ ప్రకారం అగ్రస్థానంలో నిలిచి జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఫైనల్ ఆడుతోంది. ఈ లెక్కన ఆర్‌సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంటే.. ఆ జట్టు అగ్రస్థానం గల్లంతు అవుతుంది. అప్పుడు ముంబై ఇండియన్స్ నేరుగా ఫైనల్ చేరుతోంది. ఒక వేళ ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా.. రన్ రేట్ మెరుగ్గా ఉంచుకున్నా ఆ జట్టు అగ్రస్తానంలోనే కొనసాగి ఫైనల్ చేరుతోంది.