వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో శుభారంభం అందుకోవడంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేసింది. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి విజయాన్ని అందుకోవడం థ్రిల్లింగ్‌గా ఉందని తెలిపింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ విజయానంతరం మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. బ్యాటింగ్ కోచ్ సహకారంతోనే తాను హాఫ్ సెంచరీ సాధించగలిగానని తెలిపింది. 'ఈ మ్యాచ్ గెలిచిన తీరు సంతోషాన్నిచ్చింది. మా ప్రదర్శన మరింత సంతృప్తినిచ్చింది. జట్టులోని ప్రతీ ఒక్కరు సానుకూల దృక్పథంతో ఆడారు. ఈ విజయం క్రెడిట్ మా బ్యాటింగ్ కోచ్ హిమాన్షు భయ్యాకు ఇవ్వాలనుకుంటున్నా.

ఆయన సహకారంతోనే ఈ మ్యాచ్‌లో నేను హాఫ్ సెంచరీ సాధించాను. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత తీవ్ర నిరాశకు గురైన నన్ను ఆయన ఎంతో ప్రోత్సహించారు. దగ్గరుండి ప్రాక్టీస్ చేయించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశారు. మానసికంగా అలిసిపోయిన నాకు బ్రేక్ తీసుకోవడం కూడా కలిసొచ్చింది.
ఈ మ్యాచ్ చేజింగ్‌లో గేమ్‌ను డీప్‌గా తీసుకెళ్లాలని భావించాం. నెట్స్‌లో సంజనా భారీ సిక్సర్లను ప్రాక్టీస్ చేసింది. దాంతో ఆమె ఆఖరి బంతికి సిక్స్ కొట్టగలదని మేం అంతా నమ్మకంతో ఉన్నాం. సంజనా కారణంగా మాకు బలమైన బ్యాటింగ్ డెప్త్ లభించింది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే మేం చేజింగ్ ఎంచుకున్నాం. ముందుగా బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడం ముఖ్యం కాదు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం కీలకం'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. అలైస్ కాప్సీ(53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీ సాధించగా.. జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) మెరుపులు మెరిపించారు.
ముంబై బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్, అమెలియా కేర్ రెండేసి వికెట్లు తీయగా.. షబ్నిమ్ ఇస్మాయిల్ ఓ వికెట్ తీసింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసి గెలుపొందింది. యస్తికా భాటియా(45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 57), హర్మన్‌ప్రీత్ కౌర్(34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 6 బంతుల్లో 12 పరుగులు అవసరం కాగా.. క్యాప్సీ ఐదు బంతుల్లో రెండు వికెట్లు తీసి 7 పరుగులు మాత్రమే ఇచ్చింది. దాంతో ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమవ్వగా.. సంజనా సిక్స్ బాది విజయాన్నందించింది.