వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్ ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. యూపీ వారియర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 42 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేసింది. నాట్ సీవర్ బ్రంట్(31 బంతుల్లో 8 ఫోర్లతో 45), అమెలియా కేర్(23 బంతుల్లో 6 ఫోర్లతో 39), హర్మన్‌ప్రీత్ కౌర్(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33) రాణించారు. యూపీ వారియర్స్ బౌలర్లలో చమరి ఆటపట్టు(2/27) రెండు వికెట్లు తీయగా.. రాజశ్వేరి గైక్వాడ్, దీప్తి శర్మ, సైమా థాకోర్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులే చేసి ఓటమిపాలైంది. దీప్తి శర్మ(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో షైకా ఇషాక్(3/27) మూడు వికెట్లు తీయగా.. నాట్ సీవర్ బ్రంట్(2/14), రెండు వికెట్లు పడగొట్టింది. షబ్నిమ్ ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, పూజా వస్త్రాకర్, సజీవన్ సజన తలో వికెట్ తీసారు.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. యూపీ వారియర్స్‌కు నాలుగో ఓటమి. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లోకి దూసుకెళ్లింది.