
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2023లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన కీలక మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ చిత్తయ్యింది. ఇక అసాధారణ ఆటతీరుతో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన హర్మన్‌ప్రీత్ సేన అనూహ్యంగా ఢీలా పడింది. ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు మాత్రమే చేసింది.
హర్మన్ ప్రీత్ కౌర్(26 బంతుల్లో 3 ఫోర్లతో 23), పూజా వస్త్రాకర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26), ఇస్సీ వాంగ్(24 బంతుల్లో సిక్స్‌తో 23) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో మరజన్నే కాప్, శిఖా పాండే, జెస్ జోనాస్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. తెలుగు తేజం అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టింది.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు మెగ్ లాన్నింగ్(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), షెఫాలీ వర్మ(15 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 33) ధాటిగా ఆడగా.. అలిస్ క్యాపీ(17 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 38 నాటౌట్) మెరుపులు మెరిపించింది. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్ ఓ వికెట్ పడగొట్టింది. ఈ భారీ విజయంతో మెరుగైన రన్ రేట్ సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మరో మ్యాచ్ గెలిచి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటే ఢిల్లీ నేరుగా ఫైనల్ చేరనుంది.

రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉండగా.. మూడో స్థానంలో యూపీ వారియర్స్ నిలిచింది. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాయి. ముంబై ఇండియన్స్ తమ చివరి మ్యాచ్‌లో ఆర్‌సీబీని చిత్తుగా ఓడిస్తే అగ్రస్థానాన్ని అందుకుంటుంది. లేకుంటే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది.