
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్ర సీజన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ గెలుపొందింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఖాతాలో 8వ టైటిల్ చేరింది.
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ సారథ్యంలో ఐదు టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్.. ఛాంపియన్స్ లీగ్‌లో రెండు టైటిళ్లు అందుకుంది. తాజాగా డబ్ల్యూపీఎల్ విజయంతో మోస్ట్ పవర్ ఫుల్ ఫ్రాంచైజీగా అవతరించింది. ఆదివారం జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు ముంబై ఇండియన్స్ పురుషుల ఆటగాళ్లంతా హాజరయ్యారు.
స్టాండ్స్‌లో తమ అమ్మాయిలను ఆటను చూస్తూ వారిని ఎంకరేజ్ చేశారు. విజయానంతరం ఎగిరి గంతేసారు. రోహిత్ శర్మ తన సతీమణి రాధిక సజ్దేతో ఈ మ్యాచ్‌కు హాజరవ్వగా.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తదితర ముంబై ఆటగాళ్లు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అమ్మాయిల ఆటకు అండగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెగ్ లానింగ్(29 బంతుల్లో 5 ఫోర్లతో 35), శిఖా పాండే (17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్), రాధా యాదవ్ ( 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27 నాటౌట్) ఆదుకున్నారు. ముంబై బౌలర్లలో ఇసీ వాంగ్ (3/42), హేలీ మాథ్యూస్ (3/5), అమేలియా కెర్ (2/18) చెలరేగారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 134 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. నాట్ సీవర్‌తో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (39 బంతుల్లో 5 ఫోర్లతో 37), అమేలియా కేర్ (8 బంతుల్లో 2 ఫోర్లతో 14 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, జోనాసెన్ చెరొక వికెట్ పడగొట్టారు.