WPL 2023: ప్చ్.. మళ్లీ ఓడిన ఆర్‌సీబీ.. బోణీ కొట్టిన గుజరాత్!

ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో ఆర్‌సీబీపై గుజరాత్ జెయింట్స్ గెలుపొందింది. ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్ డబ్ల్యూపీఎల్‌లో బోణీ కొట్టింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్(45 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 67),సోఫియా డంక్లీ(28 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హీథర్ నైట్ రెండేసి వికెట్లు తీయగా.. మేఘన స్కట్, రేణుకా సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
పోరాడి ఓడిన ఆర్‌సీబీ..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులే చేసి ఓటమిపాలైంది. సోఫీ డివైన్(45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఎల్లిస్ పెర్రీ(32), హీథర్ నైట్(11 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్) పర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో అష్లే గార్డనర్ మూడు వికెట్లు తీయగా.. సదర్లాండ్ రెండు వికెట్లు పడగొట్టింది.
శుభారంభం దక్కినా..
202 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీకి శుభారంభం దక్కింది. ఓపెనర్లు స్మృతి మంధాన(18), సోఫి డివైన్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. అయితే పరవ్ ప్లేలోనే మంధాన క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఎల్లిస్ పెర్రీ కూడా ధాటిగా ఆడింది. 43 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మాన్సి జోషి విడదీసింది. క్రీజులోకి రిచా ఘోష్ రాగా.. సోఫీ డివైన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.
సోఫీ రాణించినా..
రెండు బౌండరీలతో జోరు కనబర్చిన రిచా ఘోష్(10) గార్డనర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. క్రీజులోకి వచ్చిన హీథర్ నైట్ వచ్చి రావడంతోనే రెండు బౌండరీలు బాదగా.. సదర్లండ్ బౌలింగ్‌లో డివైన్ భారీ సిక్సర్ బాదింది. అయితే ఆ మరసటి బంతికే భారీ సిక్సర్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. క్రీజులోకి కనిక ఆహుజా రాగా.. సదర్లాండ్ భారీ షాట్లతో విరుచుకుపడింది.
దాంతో ఆర్‌సీబీ విజయానికి 18 బంతుల్లో 44 పరుగులు అవసరమవ్వగా.. స్నేహ్ రాణా వేసిన 18వ ఓవర్‌లో కనిక రెండు బౌండరీలు బాదడంతో 11 పరుగులే వచ్చాయి. అష్లే గార్డనర్ వేసిన 19వ ఓవర్‌లో కనిక(10) స్టంపౌటవ్వగా.. హీథర్ నైట్ ఆఖరి బంతికి సిక్స్ బాదడంతో 9 పరుగులే వచ్చాయి. సదర్లాండ్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఖేమ్నర్(2) ఔటవ్వడంతో ఆర్‌సీబీ విజయవకాశాలు మూసుకుపోయాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications