
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆర్‌సీబీకి ఇది వరుసగా ఐదో పరాజయం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది.
కెప్టెన్ స్మృతి మంధాన(8) విఫలమైనా.. ఎల్లిస్ పెర్రీ(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించింది. రిచా ఘోష్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37)కలిసి పెర్రీ నాలుగో వికెట్‌కు 74 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా.. తారా నోర్రీస్ ఓ వికెట్ పడగొట్టింది.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలుపొందింది. మరిజన్నే కేప్(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), జెస్స్ జొనాస్సెన్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29) చివరి వరకు క్రీజులో నిలబడి విజయాన్నందించారు. అలిస్ కాప్సీ(38), జెమీమా రోడ్రిగ్స్(32) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో మేఘన్ స్కట్, ప్రీతీ బోస్ చెరొక వికెట్ తీయగా.. సోభన ఆశా రెండు వికెట్లు తీసింది.
150 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి తొలి ఓవర్‌లో షాక్ తగిలింది. మేగన్ స్కట్ బౌలింగ్‌లో షెఫాలీ వర్మ క్లీన్ బౌల్డ్ అయ్యి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగింది. క్రీజులోకి వచ్చిన అలీస్ క్యాప్సీ బౌండరీలతో విరుచుకుపడింది. ధాటిగా ఆడిన అలీస్‌ను ప్రీతీ బోస్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. దాంతో ఢిల్లీ పవర్ ప్లేలోనే 2 వికెట్లకు 52 పరుగులు చేసింది.

పవర్ ప్లే అనంతరం కెప్టెన్ మెగ్ లాన్నింగ్(15)ను సోభనా ఆశా క్యాచ్ ఔట్ చేసింది. ఆ వెంటనే క్రీజులో సెట్ అయిన జెమీమా రోడ్రిగ్స్(32) కూడా ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి 18 బంతుల్లో ఢిల్లీ విజయానికి 24 పరుగులు అవసరమవ్వగా.. కాప్ భారీ సిక్సర్ బాది ఒత్తిడిని తగ్గించింది. 19వ ఓవర్‌లో కేప్ ఒక్క బౌండరీ మాత్రమే కొట్టడంతో చివరి ఓవర్‌లో ఢిల్లీ గెలుపునకు 9 పరుగులు అవసరమయ్యాయి. రేణుకా సింగ్ వేసిన చివరి ఓవర్‌లో జొనాస్సెన్ 6, 4 బాది విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.