వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అభిమానుల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. పురుషుల జట్టు తరహాలోనే అభిమానులు స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ మహిళల జట్టుకు అండగా నిలుస్తున్నారు.
హోమ్ గ్రౌండ్ బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. యూపీ వారియర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు.. తాజాగా గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు అదే తరహాలో మద్దతుగా నిలిచారు.

స్మృతి మంధాన టాస్ గెలిచిన వెంటనే స్టేడియం దద్దరిల్లేలా గట్టిగా అరుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అభిమానుల మద్దతుకు ఫిదా అయిన స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌సీబీ అభిమానులంతా ఫిదా అవుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్మతి మంధాన బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభ ఓవర్లలో ఈ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని ఈ నిర్ణయంతీ సుకున్నానని స్మతి మంధాన తెలిపింది. అంతేకాకుండా టీ20ల్లో లక్ష్యాన్ని చేధించడం సులువుగా ఉంటుందని, తొలి మ్యాచ్ గెలిచిన జోరును కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా విన్నింగ్ టీమ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
పిచ్ నుంచి లభించిన అడ్వాంటేజ్‌ను అందిపుచ్చుకున్న ఆర్‌సీబీ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు తీసింది. రేణుక సింగ్ ధాటికి బెత్ మూనీ(8) క్లీన్ బౌల్డ్ అవ్వగా.. ఫోబెల్ లిట్చిఫీల్డ్(5) స్టంపౌట్‌గా వెనుదిరిగింది. 8 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ 2 వికెట్లకు 40 పరుగులే చేసింది.