
హైదరాబాద్: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వరుసగా రెండో విజయాన్నందుకుంది. వరుసగా ఐదు ఓటముల తర్వాత యూపీ వారియర్స్‌పై గెలుపొందిన ఆర్‌సీబీ.. శనివారం గుజరాత్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. సోఫీ డివైన్(36 బంతులు.. 9 ఫోర్లు.. 8 సిక్సర్లు.. 99) విధ్వంసకర బ్యాటింగ్‌తో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు రసవత్తరంగా మారాయి. ఆర్‌సీబీ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కాగా.. మూడో ప్లేస్ కోసం ఆర్‌సీబీతో పాటు యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ పోటీపడుతున్నాయి.
6 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఇప్పటికే ముంబై ఇండియన్స్ (10 పాయింట్లు) ప్లేఆఫ్స్ చేరగా.. 6 మ్యాచ్‌ల్లో నాలుగు నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ (8) కూడా ముందంజ వేసింది. మిగతా మూడు జట్లలో ఏదీ 8 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ బెర్తు ఖరారైంది. ఇక మూడో ప్లేఆఫ్స్ బెర్తు కోసం యూపీ వారియర్స్ (6 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు), బెంగళూరు (7 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు), గుజరాత్ (7 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు) మధ్య పోటీ నెలకొంది. లీగ్ దశలో ప్రతి జట్టూ 8 మ్యాచ్‌లు ఆడుతుంది.
బెంగళూరు తమ చివరి మ్యాచ్‌లో టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడా విజయం సాధించి మెరుగైన రన్ రేట్ సాధిస్తే ఆర్‌సీబీకి అవకాశం ఉంటుంది. అయితే యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.

యూపి వారియర్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒకదాంట్లో ఓడితే మాత్రం మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ముందంజ వేస్తోంది. గుజరాత్ జెయింట్స్ తమ తదుపరి మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తోంది. అయితే ఆ జట్టు రన్‌రేట్ మెరుగ్గా లేకపోవడం ప్రతికూలాంశం.

శనివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్ ( 42 బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), ఆష్లీ గార్డ్‌నర్ ( 26 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌తో 41) రాణించారు. అనంతర ఆర్‌సీబీ సోఫీ డివైన్ సంచలన ఇన్నింగ్స్‌తో 15.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 189 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన ( 31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37) కూడా లీగ్‌లో తొలిసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడింది. టోర్నీలో రెండో విజయంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.