
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్ర సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో అమ్మాయిల ధనాధన్ ఆటకు తెరలేవనుంది. ఈ లీగ్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆరంభ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసింది. ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత బిజినెస్ టైకూన్స్ ముఖేశ్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్, అదాని ఫ్రాంచైజీ గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు బాలీవుడ్ హీరోయిన్లు కృతి సనన్, కియారా అద్వానీలతో ప్రత్యేకమైన డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. ఈ ముద్దుగుమ్మల డ్యాన్స్‌తో పాటు బాలీవుడ్ ర్యాపర్ ఏపీ దిల్లాన్ తన పాటతో మోత మోగించనున్నాడు.
ఇప్పటికే ఆరంభ వేడుకులకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరోవైపు ఐదు ఫ్రాంచైజీలు తమ సత్తా చాటేందుకు సిద్దమయ్యాయి. పురుషుల ఐపీఎల్‌కు చెందిన ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మహిళల లీగ్‌లో భాగమవ్వడంతో ఈ టోర్నీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఐపీఎల్ తరహాలోనే లీగ్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరగనుండగా.. అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయి.
డబ్ల్యూపీఎల్ కోసం ప్రత్యేకంగా 'శక్తి' పేరుతో బీసీసీఐ ఓ మస్కట్‌ను కూడా రూపొందించింది. మ్యాచ్‌లన్నీ ముంబైలోని డీవై పాటిల్, బ్రౌబర్న్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అమ్మాయిలు, మహిళలకు ఉచితం కాగా.. పురుషులకు రూ.100, రూ.400 రేట్లలోనే టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ సక్సెస్ ఆధారంగా వచ్చే సీజన్లలో టికెట్ల రేట్లు పెరుగనున్నాయి.
డబ్ల్యూపీఎల్ ప్రసార హక్కులను వయాకామ్ సంస్థ దక్కించుకోగా.. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ప్రత్యక్షప్రసారం కానున్నాయి. జియో సినిమా యాప్, వూట్ యాప్‌లో కూడా మ్యాచ్‌లు రానున్నాయి. జియో సిమ్ కస్టమర్లు ఎలాంటి డబ్బులు లేకుండా ఫ్రీగా 4కే రిజల్యూషన్‌లో మ్యాచ్‌లను చూడవచ్చు.