
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్ర సీజన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలిచిన ముంబై.. అమ్మాయిల ధనాధన్ ఆటలోనూ బోణీ కొట్టింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో రసవత్తరంగా సాగిన ఫైనల్లోనూ పైచేయి సాధించింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ముందుగా బంతితో ఇసీ వాంగ్ (3/42), హేలీ మాథ్యూస్ (3/5), అమేలియా కెర్ (2/18) సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో నాట్ సీవర్(55 బంతుల్లో 7 ఫోర్లతో 66 నాటౌట్) దుమ్మురేపింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెగ్ లానింగ్(29 బంతుల్లో 5 ఫోర్లతో 35), శిఖా పాండే (17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్), రాధా యాదవ్ ( 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27 నాటౌట్) ఆదుకున్నారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 134 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. నాట్ సీవర్‌తో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( 39 బంతుల్లో 5 ఫోర్లతో 37), అమేలియా కేర్ (8 బంతుల్లో 2 ఫోర్లతో 14 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, జెస్స్ జోనాసెన్ చెరొక వికెట్ పడగొట్టారు.
లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై విజయం కోసం శ్రమించాల్సి వచ్చింది. 4 ఓవర్లలో 24 పరుగులకే ఓపెనర్లు హేలీ (13), యాస్తిక భాటియా (4) వెనుదిరిగారు. ఈ పరిస్థితుల్లో సీవర్, హర్మన్ ప్రీత్ ఆచితూచి ఆడుతున్న ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కాస్త స్లోగా ఆడటంతో చేధించాల్సి రన్‌రేట్ పెరుగుతూ పోయింది. 11 ఓవర్లలో ముంబై 55 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత బ్యాటర్లు కాస్త వేగం పెంచినా 16 ఓవర్లలో 95/2తో నిలిచిన ముంబైకి.. చివరి 4 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతిలో 8 వికెట్లున్నా లక్ష్యంగా చేధించడం కఠినంగా అనిపించింది. అదే పరిస్థితిల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఔటవ్వడం మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ సీవర్ దూకుడుగా ఆడుతూ.. స్కోర్ బోర్డును పరుగెత్తించింది.
18వ ఓవర్లో శిఖా 5 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. అయితే 19వ ఓవర్‌లో అనవసర ఒత్తిడికి గురైన జొనాస్సెన్ 16 పరుగులివ్వడంతో మ్యాచ్ ముంబై వైపు మళ్లింది. చివరి ఓవర్‌లో 5 పరుగులే చేయాల్సి రావడంతో సునాయసంగా చేధించింది. జొనాస్సెన్ కూడా 10 పరుగుల లోపే ఇచ్చి ఉంటే ఢిల్లీకి విజయవకాశాలు ఉండేవి.